ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి.. బంగారు రాష్ట్రం చేస్తాం

వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వానికి ఒక్క అవకాశం ఇస్తే ఐదేళ్లలో పశ్చిమ బెంగాల్‌ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హోంమంత్రి........

Published : 07 Nov 2020 01:12 IST

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో హోంమంత్రి అమిత్‌షా

కోల్‌కతా: వచ్చే ఏడాది జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వానికి ఒక్క అవకాశం ఇస్తే ఐదేళ్లలో పశ్చిమ బెంగాల్‌ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హోంమంత్రి, భాజపా సీనియర్‌ నేత అమిత్‌షా హామీ ఇచ్చారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగించుకున్న అనంతరం కోల్‌కతాలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీల అమలులో సీఎం మమతా బెనర్జీ విఫలమయ్యారని విమర్శించారు.

‘‘కాంగ్రెస్‌కు, కమ్యూనిస్టులకు, మమతా బెనర్జీకి ఇప్పటి వరకు అవకాశం ఇచ్చారు. ఈసారి నరేంద్రమోదీ నాయకత్వానికి అవకాశం ఇచ్చి చూడండి. ఐదేళ్లలో బంగారు రాష్ట్రంగా బెంగాల్‌ను తీర్చిదిద్దుతాం. రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం’’ అని షా అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తొలి ఐదేళ్లలోనే దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలకు మంచినీరు, గ్యాస్‌, విద్యుత్‌, మరుగుదొడ్ల సదుపాయం కల్పించామని చెప్పారు. 2010లో అధికారంలోకి వచ్చిన మమత బెంగాల్‌ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు.

కొవిడ్‌, వరదల సమయంలోనూ తృణమూల్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అమిత్‌ షా ఆరోపించారు. గతేడాది రాష్ట్రంలో 100 మంది భాజపా కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్పారు. కానీ, మమత బెనర్జీ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ 200కు పైగా సీట్లతో భాజపా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించినట్లే మరోసారి ఆదరించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని