మళ్లీ మహాకూటమి పంచకు నీతీశ్‌: చిరాగ్‌

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి పంచకు చేరడం ఖాయమని ఎల్జేపీ అధినేత చిరాగ్‌ పాస్వాన్‌........

Published : 01 Nov 2020 17:57 IST

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి పంచకు చేరడం ఖాయమని ఎల్జేపీ అధినేత చిరాగ్‌ పాస్వాన్‌ అన్నారు. అంతేకాదు 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి పోటీగా ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలవాలని భావిస్తున్నారని చెప్పారు. ఎప్పటికైనా భాజపాకు తామే అత్యంత విశ్వాసపాత్రమైన పార్టీ అని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీతీశ్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు.

లాలూ ప్రసాద్‌ పాలనను వ్యతిరేకిస్తూ తొలిసారి ఎన్డీయే భాగస్వామిగా నీతీశ్‌ అధికారంలోకి వచ్చారని చిరాగ్‌ గుర్తుచేశారు. కొన్నేళ్లకే భాజపాతో బంధాన్ని తెంచుకున్నారన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీని తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం లాలూతో కలిసి ఎన్నికల్లో గెలుపొందారని, రెండేళ్లకే ఆ బంధాన్ని తెంచుకుని మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరిన నీతీశ్‌ పచ్చి అవకాశవాది అని విమర్శించారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి మహాకూటమి పంచన చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చిరాగ్‌ జోస్యం చెప్పారు. ఈ విషయంలో తన మాటలను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం తానే అన్నట్లుగా నీతీశ్‌ తనను తాను ప్రొజెక్ట్‌ చేసుకుంటారని అన్నారు. తాము అధికారంలోకొస్తే నీతీశ్‌ అవినీతిని బయట పెడతానని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో ఎల్జేపీ 140 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టింది. ఎక్కువ స్థానాల్లో జేడీయూ అభ్యర్థులపైనే పోటీకి ఉంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని