క్షమాపణలు ఎందుకో అర్థం కావట్లేదు:థరూర్

పుల్వామా ఉగ్రఘటనపై పాకిస్థాన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో..ఆ ఘటన అనంతరం కాంగ్రెస్ స్పందించిన తీరుపై క్షమాపణ చెప్పాలంటూ కేంద్రమంత్రి డిమాండ్‌ను ఆ పార్టీ నేత శశిథరూర్‌ ఖండించారు.

Published : 31 Oct 2020 13:41 IST

దిల్లీ: పుల్వామా ఉగ్రఘటనపై పాకిస్థాన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో..అప్పట్లో కాంగ్రెస్ స్పందించిన తీరుపై క్షమాపణ చెప్పాలంటూ కేంద్రమంత్రి డిమాండ్‌ను ఆ పార్టీ నేత శశిథరూర్‌ ఖండించారు. తాము అసలు ఎందుకు క్షమాపణ చెప్పాలో ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదంటూ శనివారం మంత్రి ఆరోపణలను తిప్పికొట్టారు. గతేడాది జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఆ ఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. కాగా, ఆ దాడి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్ సాధించిన ఘన విజయమంటూ ఆ దేశ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్..‘ఆ దాడి వెనక తమ హస్తం ఉందని పాక్‌ స్వయంగా అంగీకరించింది. ఇప్పుడు.. కాంగ్రెస్‌, కుట్ర సిద్ధాంతాల గురించి వ్యాఖ్యలు చేసిన ఇతరులు వెంటనే క్షమాపణ చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే థరూర్ ట్వీట్ చేశారు. 

‘కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటో తెలుసుకోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను. ప్రభుత్వం సైనికులను సురక్షితంగా ఉంచుతుందని ఆశించినందుకా? ఈ విషాదాన్ని రాజకీయం చేయనందుకా? అమరుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసినందుకా?’ అంటూ భాజపా ఆరోపణలపై థరూర్‌ వ్యంగ్యంగా స్పందించారు. అలాగే, జావడేకర్‌ మాట్లాడిన వార్తా కథనాన్ని షేర్ చేశారు. 

ఇదిలా ఉండగా..ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఐక్యతా విగ్రహం వద్ద నివాళి అర్పించిన ప్రధాని మోదీ కూడా తన ప్రసంగంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తమ బిడ్డలను కోల్పోయామని భారతావని గుండెపగిలే వేదనను అనుభవిస్తుంటే, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పుల్వామా ఘటనను రాజకీయం చేశారంటూ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని