Gujarat: ఆమ్‌ఆద్మీ పార్టీ గుజరాత్‌ చీఫ్‌ గోపాల్‌ ఇటాలియా అరెస్ట్‌

ఓ వీడియోకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్‌ ముందు విచారణకు హాజరైన ఆమ్‌ఆద్మీ పార్టీ గుజరాత్‌ చీఫ్‌ గోపాల్‌ ఇటాలియాను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 14 Oct 2022 01:40 IST

దిల్లీ: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు (Gujarat Elections) గడువు సమీపిస్తోన్న వేళ.. భాజపా, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆప్‌ గుజరాత్‌ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియాను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం అక్కడి రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై దిల్లీలోని జాతీయ మహిళా కమిషన్‌ (NCW) ముందు గోపాల్‌ ఇటాలియా హాజరయ్యారు. విచారణ జరుగుతోన్న సమయంలో ఎన్‌సీడబ్ల్యూ కార్యాలయానికి చేరుకున్న ఆప్‌ కార్యకర్తలు.. ఆందోళన చేపట్టారు. దీంతో ఎన్‌సీడబ్ల్యూ ఫిర్యాదు మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు ఇటాలియాను అదుపులోకి తీసుకున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై గోపాల్‌ ఇటాలియా అభ్యంతరకర పదాలు వాడారని భాజపా ఆరోపించింది. అందుకు సంబంధించిన ఓ పాత వీడియోను భాజపా ఐటీ సెల్‌ ఇంఛార్జ్‌ అమిత్‌ మాల్‌వీయ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్‌.. వివరణ ఇవ్వాలంటూ గోపాల్‌ ఇటాలియాకు సమన్లు జారీ చేసింది. ‘ప్రధానమంత్రితోపాటు మహిళలపై అభ్యంతరకర భాషను వాడటం అవమానకరం. మీరు వాడిన భాష.. లింగ పక్షపాతం, స్త్రీ ద్వేషంతో కూడుకున్నవి, ఇవి మీకు తగదు. దీనిపై వివరణ ఇవ్వాలి’ అని పేర్కొంటూ గోపాల్‌ ఇటాలియాకు అక్టోబర్‌ 9న ఎన్‌సీడబ్ల్యూ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్‌ ముందు హాజరైన అతడిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మండిపడ్డ ఆమ్‌ఆద్మీ పార్టీ

గోపాల్‌ ఇటాలియాను అదుపులోకి తీసుకోవడంపై ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆయన ఆరెస్టు ద్వారా గుజరాత్‌లో పటేల్‌ వర్గం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ‘గోపాల్‌ ఇటాలియా సర్దార్‌ పటేల్‌ వారసుడు. మీ జైలుకు భయపడరు’ అంటూ ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని