ఎడప్పాడి నుంచి పళని‌.. మరి పన్నీర్‌‌? 

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాజకీయ దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత మరణానంతరం తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా .....

Updated : 06 Mar 2021 11:19 IST

ఆరుగురితో అన్నాడీఎంకే తొలి జాబితా విడుదల

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాజకీయ దిగ్గజాలైన కరుణానిధి, జయలలిత మరణానంతరం తొలిసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నాడీఎంకే, డీఎంకే పట్టుదలతో ఉన్నాయి. అధికార అన్నాడీఎంకే ఈసారి భాజపాతో కలిసి బరిలో దిగుతుండగా.. కాంగ్రెస్‌, వామపక్షాలతో జతకట్టి డీఎంకే ఎన్నికల సంగ్రామంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీకి అన్నాడీఎంకే ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం పేర్లు ఉన్నాయి. ఇద్దరూ తమ సొంత నియోజకవర్గాల నుంచే బరిలో నిలుస్తున్నారు. పళనిస్వామి ఎడప్పాడి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతుండగా..  డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం బోడినయకనూరు నుంచి పోటీలో ఉన్నారు. 2011 నుంచి ఇద్దరూ ఇవే నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం.

వీరితో పాటు ఈ జాబితాలో మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్‌ (రొయపురం నియోజకవర్గం), న్యాయశాఖ మంత్రి షణ్ముగం (విజుపురం), ఎమ్మెల్యేలు ఎస్పీ షన్ముగనంతన్‌ (శ్రీవైగుండం),  ఎస్‌.తెన్మోజి (నిలకొట్టాయ్‌)లకు స్థానం దక్కింది. మరోవైపు, అన్నాడీఎంకే, మిత్రపక్షాల మధ్య  సీట్ల కేటాయింపులు దాదాపు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. భాజపా 25 నుంచి 30 స్థానాలు కోరుతున్నప్పటికీ అన్నాడీఎంకే మాత్రం 20 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకే 20 స్థానాలు కావాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎన్నిసీట్లు కేటాయిస్తారో చూడాలి. 

తమిళనాడులోని 38 జిల్లాల పరిధిలో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 6న పోలింగ్‌ జరగనుండగా..  మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని