Maharashtra Cabinet: ‘మహా’ కేబినెట్‌ విస్తరణ.. అజిత్‌ పవార్‌కు ఆర్థిక శాఖ..!

మహారాష్ట్ర అధికార ప్రభుత్వంలో చేరిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలు దక్కాయి. మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఆయన వర్గానికి చెందిన మిగతా ఎమ్మెల్యేలకూ ఆయా శాఖలు కేటాయించారు.

Updated : 14 Jul 2023 17:43 IST

ముంబయి: ఇటీవల ఎన్సీపీ (NCP)ని చీల్చిన అజిత్‌ పవార్‌ (Ajit Pawar).. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రంలోని అధికార ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు.. కేబినెట్‌ విస్తరణలో భాగంగా కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖ (Finance Ministry) దక్కింది. ఆయనతోపాటు ప్రభుత్వంలో చేరిన ఇతర ఎన్సీపీ ఎమ్మెల్యేలకూ వివిధ శాఖలు కేటాయించారు. అధికార ప్రభుత్వంలో చేరిన రోజే వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే దాదాపు రెండు వారాల తర్వాత శాఖలు దక్కాయి. ఈ మేరకు సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మంత్రులు.. శాఖలు..

అజిత్‌ పవార్.. ఫైనాన్స్‌, ప్లానింగ్‌; ఛగన్‌ భుజ్‌బల్‌.. పౌరసరఫరాలు; దిలీప్‌ వాల్సే పాటిల్‌.. సహకార శాఖ; ధనంజయ్‌ ముండే.. వ్యవసాయ శాఖ; అదితి తట్కరే.. మహిళా శిశు సంక్షేమం; హసన్‌ ముష్రీఫ్‌.. వైద్యవిద్య; ధర్మారావు ఆత్రం.. ఆహార, ఔషధ నియంత్రణ; సంజయ్‌ బన్సొడే.. క్రీడలు; అనిల్‌ పాటిల్‌.. పునరావాసం, విపత్తు నిర్వహణ శాఖ

ఎన్సీపీ తొమ్మిది మంది మంత్రుల చేరికతో మహారాష్ట్ర కేబినెట్‌లో మొత్తం మంత్రుల సంఖ్య 29కి చేరుకుంది. కేబినెట్‌లో అదితి తట్కరేకు అవకాశం కల్పించడంతో.. శిందే మంత్రివర్గంలో ఆమె మొదటి మహిళ మంత్రిగా నిలిచారు. ఇదిలా ఉండగా.. ఏడాది కిందట శివసేనలో చీలిక వచ్చినట్లుగానే ఇటీవల ఎన్సీపీ కూడా ముక్కలైంది. పార్టీ సీనియర్‌ నేత, పవార్‌కు స్వయానా అన్న కుమారుడైన అజిత్‌ పవారే తిరుగుబాటు చేశారు. వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయారు. మరోవైపు.. సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ శరద్‌ పవార్‌ వర్గం అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని