Akhilesh Yadav: ప్రతిపక్ష నేతగా అఖిలేశ్‌ యాదవ్‌.. బాబాయి శివపాల్‌ అలక

సమాజ్‌వాదీ పార్టీలో మరోసారి విబేధాలు తలెత్తాయా..? అబ్బాయి అఖిలేశ్‌ యాదవ్‌.. బాబాయి శివపాల్‌ యాదవ్‌ మధ్య సంబంధాలు మళ్లీ చెడిపోయాయా? ప్రస్తుత పరిణమాలు

Published : 26 Mar 2022 15:19 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీలో మరోసారి విభేదాలు తలెత్తాయా..? అబ్బాయి అఖిలేశ్‌ యాదవ్‌.. బాబాయి శివపాల్‌ యాదవ్‌ మధ్య సంబంధాలు మళ్లీ చెడిపోయాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఎన్నికయ్యారు. అయితే ఈ సమావేశానికి శివపాల్‌ యాదవ్‌ను ఆహ్వానించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

సమాజ్‌వాదీ పార్టీ నుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం లఖ్‌నవూలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీలోనే పార్టీ శాసనసభాపక్ష నేతగా అఖిలేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్‌ ఉత్తమ్‌ తెలిపారు. అయితే ఈ సమావేశానికి అఖిలేశ్‌ బాబాయి, ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ శివపాల్‌ యాదవ్‌కు ఆహ్వానం అందలేదట. దీనిపై ఆయన బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పార్టీ సమావేశానికి నన్ను ఆహ్వానించలేదు. ఈ భేటీ కోసం నేను రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. నా కార్యక్రమాలను కూదా రద్దు చేసుకున్నా. నేను సమాజ్‌వాదీ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నన్ను పిలవలేదు’’ అని శివపాల్‌ అసహనం చెందారు. 

అఖిలేశ్‌, శివపాల్‌ మధ్య 2016లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. శివపాల్‌ను అఖిలేశ్ తన కేబినెట్‌ నుంచి తప్పించడం.. ఆ తర్వాత శివపాల్‌ పార్టీ నుంచి విడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. ఆ ఎన్నికల్లో శివపాల్‌ సొంతంగా పోటీ చేశారు. అయితే ఇటీవల 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిద్దరూ పాత విభేదాలను పక్కనబెట్టి చేతులు కలిపారు. శివపాల్‌ తన పార్టీని ఎస్పీలో కలుపుతున్నట్లు ప్రకటించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ శివపాల్‌ ఎస్పీ గుర్తుపైనే పోటీ చేశారు. 

ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కూటమి 125 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు చాలా దూరంలో ఆగిపోయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు సీట్లు గెలుచుకోవడం గమనార్హం. అఖిలేశ్‌ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. కర్హాల్‌ నుంచి పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. అయితే అంతకుముందే ఆజంగఢ్‌ ఎంపీగా ఉన్న ఆయన.. ఇటీవల తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ఈ త్యాగం తప్పట్లేదంటూ అఖిలేశ్ ట్విటర్లో రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని