Sharad pawar: వయసు 82 అయితే ఏంటి?.. సమర్థంగా పని చేయగలను: శరద్‌పవార్‌

పార్టీ పేరు, గుర్తుపై తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత శరద్‌పవార్‌ దిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు.

Updated : 06 Jul 2023 19:33 IST

దిల్లీ: ఎన్సీపీలో (NCP) వర్గపోరు ఎన్నికల సంఘాన్ని చేరిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత శరద్‌పవార్‌ (Sharad Pawar) పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న ముంబయిలో ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన తాజాగా.. దిల్లీలోని తన నివాసంలో పార్టీ జాతీయస్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పీసీ చాకో, జితేంద్ర అహ్వాడ్‌, ఫౌజియా ఖాన్‌, వందన చవాన్‌ సహా 13 మంది నేతలు హాజరయ్యారు.ఈ సమావేశంలో గతంలో కార్యనిర్వాహక అధ్యక్షపదవికి ఎంపిక చేసిన ప్రఫుల్ పటేల్, సునీల్‌ ఠాక్రే సహా 9 మందిపై బహిష్కరణకు కార్యవర్గం ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. ఎన్సీపీకి తానే అధ్యక్షుడినని అన్నారు. ఎవరైనా కాదంటే.. అది పూర్తిగా అవాస్తవమే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అంటుంటే దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ అజిత్‌పవార్‌ను ఉద్దేశించి అన్నారు.

వయసును బట్టి రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించాలంటూ గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్న తిరుగుబాటు నేత అజిత్‌పవార్‌ వ్యాఖ్యలపై తాజాగా శరద్‌పవార్‌ స్పందించారు. రాజకీయాలకు వయసు కొలమానం కాదని, దానికి అట్టడుగు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.  ‘‘ నాకు 82 ఏళ్లు కావొచ్చు.. 92 ఏళ్లు కావొచ్చు. నేను సమర్థంగా నా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను.రిటైర్మెంట్‌ అవసరం ఏముంది?’’ అని శరద్‌పవార్‌ అన్నారు. మరోవైపు 27 రాష్ట్రాల్లో పార్టీ యూనిట్లన్నీ శరద్‌ పవార్‌వైపే ఉన్నాయని సమావేశానికి హాజరైన నేతలు అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని పార్టీ నేతలంతా ఆయనకే మద్దతు పలుకుతారని చెప్పారు. భాజపాలో 75 ఏళ్లకే రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుంటున్నారని 83ఏళ్ల శరద్‌ పవార్‌నుద్దేశించి బుధవారం అజిత్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

పార్టీలో తమకు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ పేరుతోపాటు ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలంటూ అజిత్‌ పవార్‌ వర్గం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తమకు 40 మంది ప్రజాప్రతినిధుల (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) మద్దతు ఉందని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. దీనిని శరద్‌పవార్‌ వర్గం ఈసీ ఎదుట కేవియట్‌ చేసింది. నిర్ణయం తీసుకునే ముందు వాదనలు వినాలని కోరింది. ఈ నేపథ్యంలో శరద్‌పవార్‌ వరుస భేటీలకు ప్రాధాన్యత ఏర్పడింది.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముంబయిలో బుధవారం అజిత్‌ పవార్‌ వర్గం, శరద్‌ పవార్‌ వర్గం విడివిడిగా భేటీలు నిర్వహించాయి. కార్యాచరణపై చర్చించాయి. అజిత్‌ సమావేశానికి 32 మంది హాజరుకాగా, శరద్‌ పవార్‌ సమావేశానికి 17 మంది హాజరయ్యారు. అజిత్‌ తన మద్దతుదారులందర్నీ ముంబయిలోని ఓ హోటల్‌లో ఉంచారు. అజిత్‌ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం గుర్తించాలంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ గుర్తుపై పోటీచేసి గెలిచిన 53 మంది ఎమ్మెల్యేల్లో 2/3 అంటే 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అజిత్‌ తన మద్దతుదారులను పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంతోపాటు, తన మద్దతుదారులు బయటకు వెళ్లకుండా శరద్‌పవార్‌ మంతనాలు సాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని