Bandi sanjay: అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ సంగతి చూస్తాం: బండి సంజయ్‌

దేశంలో 80శాతం ఉన్న హిందువుల గురించి భాజపా మాట్లాడకపోతే తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గద్వాల్‌ జిల్లా అలంపూర్‌ నుంచి బండి సంజయ్‌ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది...

Updated : 14 Apr 2022 21:13 IST

అలంపూర్‌: దేశంలో 80శాతం ఉన్న హిందువుల గురించి భాజపా మాట్లాడకపోతే తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గద్వాల్‌ జిల్లా అలంపూర్‌ నుంచి బండి సంజయ్‌ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడుతూ... ఈ దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి భాజపా వ్యతిరేకం కాదన్నారు. ‘‘పాతబస్తీకి వెళ్లి భాజపా మీటింగ్‌ పెడుతుందా? అని చాలా మంది అన్నారు. చార్మినార్‌ సమావేశానికి అనుమతి ఇవ్వకపోతే  పాతబస్తీ మొత్తం మీటింగ్‌లు పెడతానని హెచ్చరించా. జోగులాంబ ఆలయాన్ని చూస్తే బాధ కలిగింది. జోగులాంబ ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు. అమ్మవారు ఏం తప్పు చేసిందని దసరా ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం లేదు. కేసీఆర్‌కు అమ్మవారు అంటే భయం లేదు కానీ మజ్లీస్‌ అంటే భయం. అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులు తిరగతోడి కేసీఆర్‌ సంగతి చూస్తాం. రంజాన్‌ కోసం కేసీఆర్‌ ప్రత్యేక జీవోలు ఇచ్చారు. శివమాల, అయ్యప్ప, హనుమాన్‌ మాల ధరిస్తే బడికి, ఉద్యోగానికి రావద్దన్నారు. వాళ్లు ఏం పాపం చేశారు’’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

ఇదే చివరి పోరాటం కావాలి..

‘‘భాజపా అధికారంలోకి వస్తే స్వేచ్ఛగా పూజలు, భిక్ష తీసుకునే విధంగా జీవో ఇస్తాం. ఉచిత విద్య, వైద్యం అందిస్తాం. ఆర్డీఎస్‌ ఎందుకు ఆధునికీకరణ చేయలేదో కేసీఆర్‌ చెప్పాలి.  పాదయాత్ర  ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుంటాం.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తాం. ఏడేళ్లుగా ఏ ఒక్క హామీని కేసీఆర్‌ నిలబెట్టుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెడలు వంచి వరి కొంటామని అనిపించిన ఘనత భాజపాదే. మిర్చి పంటకు తెగుళ్లు సోకి రైతులు బాధపడుతుంటే కేసీఆర్‌ ఆదుకున్నారా? కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకు రావాలని చూస్తే భాజపా ఊరుకోదు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు కేసీఆర్‌ ఇవ్వరు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మార్పు రావాలి. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఇదే చివరి పోరాటం కావాలి’’ అని బండి సంజయ్‌ అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జూటా: డీకే.అరుణ

‘‘నడిగడ్డ పోరాటాల గడ్డ. పాలమూరు ఆర్డీఎస్ కెనాల్‌ ప్రాజెక్టు, కరువు మీద కేసీఆర్ అనేక సార్లు మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఎనిమిదేళ్లు అవుతుంది. నడిగడ్డకు ఆర్డీఎస్ సమస్య పరిష్కరించలేదు. ఒక్క చుక్క అయినా ఆర్డీఎస్ కింద నడిగడ్డలో కేసీఆర్ పారించారా?ఆర్డీఎస్ కింద ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలి. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద చుక్క నీరు రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక జూటా. కేసీఆర్‌ను ఒడిస్తామని జోగులాంబ అమ్మవారి సాక్షిగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. ఉద్యోగాల కల్పన లేదు.. నిరుద్యోగ భృతి లేదు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైంది. కేసీఆర్ పాలనలో ఒక్క ఇల్లైనా వచ్చిందా? తెలంగాణ ప్రజా ధనాన్ని దోచుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 57 ఏళ్లు నిండితే పింఛన్లు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మూడేళ్లు అవుతుంది. ఇకపై సీఎం చెప్పే మాటలు నమ్మొద్దు. కేసీఆర్ హామీలు ఇచ్చి.. కేంద్రాన్ని అమలు చేయమంటారు’’ అని డీకే అరుణ పేర్కొన్నారు.

డెడ్ ఆయిన పార్టీ డెడ్‌లైన్‌ పెట్టడమేంటి?: విజయశాంతి

‘‘ఇప్పటివరకు పని చేసిన ప్రధాన మంత్రులెవరూ రాజ్యాంగాన్ని మార్చాలని అనలేదు. రాజ్యాంగం పాతబడిందని కేసీఆర్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటు. దళిత బిడ్డ కాబట్టే కేసీఆర్ కు అంబేడ్కర్ అంటే ఇష్టం లేదు. హుజూరాబాద్‌లో దళితబంధు పేరుతో మోసం చేయాలని చూస్తే అక్కడి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతుంది.. అంబేడ్కర్ విగ్రహం ఏమైంది? కేసీఆర్ మానవరూపంలో ఉన్న రాక్షసుడు. మోసగాడైన రాకేష్ టికాయత్‌ను కేసీఆర్ రైతు దీక్షలో పక్కన కూర్చోబెట్టుకున్నారు. కేసీఆర్ భాష చూసి దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్, తెరాస, మజ్లీస్ నేతలు దోపిడీ దొంగల్లాంటివారు. డెడ్ ఆయిన పార్టీ డెడ్‌లైన్‌ పెట్టడమేంటి?కేసీఆర్ తెలంగాణ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు. తెలంగాణ మొత్తం దివాలా తీసే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని విమర్శించారు.

బంగారు తెలంగాణ సాకారం కోసమే ఈ యాత్ర: తరుణ్ చుగ్

‘‘ప్రజా సంగ్రామ యాత్ర 31 రోజుల పాటు సాగుతుంది. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేశారు. ఈ యాత్రలో రైతులు, నిరుద్యోగులతో అన్ని వర్గాల చెంతకు వెళ్తాం. కుటుంబ పాలన నుంచి విముక్తి కావాల్సిన అవసరం ఉంది. బంగారు తెలంగాణ సాకారం కోసమే ఈ యాత్ర. డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం పోరాడుదాం’’ అని తెలిపారు.

భవిష్యత్తు భాజపాదే..: ఈటల

తెలంగాణలో ఇకపై భవిష్యత్తు అంతా భాజపాదేనని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. భాజపాను అపగలిగే శక్తి కేసీఆర్‌కు లేదన్నారు. ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణలో కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఈటల కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని