PM Modi: పేదలను మోసగించడమే కాంగ్రెస్‌ వ్యూహం: ప్రధాని మోదీ

గత 50 ఏళ్లుగా ఒకే అబద్ధాని చెబుతూ కాంగ్రెస్‌ (Congress) పార్టీ దేశంలోని పేదలను మోసం చేస్తోందని ప్రధాని మోదీ (PM Narendra Modi) విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో అవినీతి వ్యవస్థతో దేశాభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు.

Updated : 31 May 2023 19:58 IST

జైపుర్‌: పేదరిక నిర్మూలన నినాదం దశాబ్దాలుగా కాంగ్రెస్‌ (Congress) పార్టీ చెబుతోన్న అతిపెద్ద అబద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) విమర్శించారు. భాజపా (BJP) కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నెలరోజుల పాటు భారీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌( Rajasthan)లోని అజ్‌మేర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై ఆయన విమర్శలు చేశారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేసిందని అన్నారు. 

‘‘దేశంలో పేదరిక నిర్మూలన చేస్తామని కాంగ్రెస్ పార్టీ  50 ఏళ్ల నుంచి హామీలు ఇస్తోంది. అలా చెబుతూ పేదలను ప్రతిసారీ మోసం చేస్తోంది. నిజానికి పేదలకు ద్రోహం చేయాలనేది కాంగ్రెస్ వ్యూహం. పేదరికం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించింది. రాజస్థాన్‌ సహా దేశంలోని ఎంతో మంది ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు నమ్మి ఇబ్బందులకు గురయ్యారు. 2014 ముందు కాంగ్రెస్‌ పెంచి పోషించిన అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు’’ అని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ రిమోట్‌ కంట్రోల్‌ పాలనతో దేశంలోని ఎన్నో నగరాల్లో ఉగ్రదాడులు జరిగాయని ప్రధాని ఆరోపించారు. 

‘‘దేశంలో అభివృద్ధి పనులకు మోదీ ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చాల మంది అడుగుతున్నారు. భాజపా పాలనలో దేశంలో అభివృద్ధి పనులకు నిధుల కొరత అనేది ఉండదు. కాంగ్రెస్‌ పార్టీ అవినీతి వ్యవస్థతో దేశాభివృద్ధిని అడ్డుకుంది. కానీ, భాజపా ప్రభుత్వం తన 9 ఏళ్ల పాలనలో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో సుపరిపాలనను అందిస్తూ.. పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కేంద్రంలో భాజపా పాలనతో ప్రపంచం మొత్తం భారత్‌ గురించి మాట్లాడుకుంటోంది. త్వరలోనే భారత్‌లో పేదరికం అంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు’’ అని ప్రధాని మోదీ అన్నారు. 

2023 ఏడాది చివర్లో రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సభ ఎన్నికల ప్రచారానికి నాందిగా భాజపా శ్రేణులు భావిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా, అశోక్‌ గెహ్లోత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ దఫా ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భాజపా వ్యూహాలు రచిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు