Eatala: పొంగులేటి, జూపల్లితో మళ్లీ ఈటల రాజేందర్‌ సుదీర్ఘ భేటీ

పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ దాదాపు 4గంటలకుపైగా చర్చలు జరుపుతున్నారు. నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో నేతలు భేటీ అయ్యారు.

Published : 25 May 2023 15:58 IST

హైదరాబాద్: భారాస బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ మరోసారి భేటీ అయ్యారు. నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో దాదాపు నాలుగు గంటలుగా చర్చలు జరుపుతున్నారు. గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. 

పార్టీ బలోపేతంతో పాటు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. ఈ సమయంలోనే వీరితో భేటీ నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో భాజపా బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరితో ఆయన భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి వెళ్లిన భాజపా ముఖ్యనేతలు.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావుతోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఏ పార్టీలో చేరాలనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోబోమని భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లి ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత మరోమారు భాజపా నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని