West Bengal: సొంతగూటికి సువేందు అధికారి..? తృణమూల్‌ నేత కీలక వ్యాఖ్యలు!

గతేడాది పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. దానికి కారణం.. సువేందు అధికారి అని చెప్పొచ్చు. అప్పటికే అధికారంలో తృణమూల్‌ పార్టీలో మంత్రిగా, అగ్ర నాయకుడిగా కొనసాగిన సువేందు అధికారి.. ఎన్నికల ముందు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కషాయం పార్టీకి

Updated : 11 Feb 2022 18:55 IST

కోల్‌కతా: గతేడాది పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. దానికి కారణం.. సువేందు అధికారి. అప్పటికే అధికారంలో తృణమూల్‌ పార్టీలో అగ్ర నాయకుడిగా, రాష్ట్ర మంత్రిగా కొనసాగిన సువేందు అధికారి.. ఎన్నికల ముందు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాషాయం పార్టీకి బలం పెరిగి.. టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ, మమతా బెనర్జీ పార్టీనే మరోసారి అధికారంలోకి రావడంతో సువేందు అధికారి ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు. కాగా.. ఇప్పుడాయన తిరిగి సొంత గూటికి చేరాలని ప్రయత్నిస్తున్నట్లు టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్‌ ఘోష్‌ వెల్లడించారు.

‘‘భాజపాలో సువేందు అధికారి ఇమడలేకపోతున్నట్లు మాకు తెలిసింది. కాంటేయ్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. ఆ జాబితాలో సువేందు అధికారి తన సోదరుడు సౌమేందు అధికారి పేరును సూచించినా భాజపా పట్టించుకోలేదు. ఇది వరకు కాంటేయ్‌ మున్సిపాలిటీ చైర్మన్‌గా సౌమేందు పనిచేశారు. దీంతో అతడి పేరును ప్రకటించాలని డిమాండ్‌ చేసినా భాజపా పెడచెవిన పెట్టింది. ఆ పార్టీ తీరుతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కాంటేయ్‌, కాంతి ప్రాంతాలు సువేందు కుటుంబానికి కంచుకోటలా ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆ కుటుంబం ఆ ప్రాంతాలపై పట్టు కోల్పోయింది. అందుకే, సువేందు మళ్లీ మా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చింది’’ అని కునాల్‌ ఘోష్‌ తెలిపారు. సంప్రదింపులపై పూర్తి వివరాలేవి చెప్పలేనని, ఈ విషయంలో పార్టీ అధినేత్రే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని