Bihar: బిహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సై..

బిహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. భాజపా నుంచి ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.

Updated : 28 Jan 2024 13:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహా కూటమి ప్రభుత్వం పతనం కాగా.. ఎన్‌డీఏ (NDA) ప్రభుత్వ ఏర్పాటుకు చకచక అడుగులు పడుతున్నాయి. తాజాగా జేడీయూ(JDU)తో జట్టు కట్టి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా (BJP) సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి వినోద్‌ తావ్‌డే వెల్లడించారు. ‘‘భాజపా-జేడీయూ ఇతర మిత్రపక్షాలతో కలిసి బిహార్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు తాజాగా జరిగిన శాసనసభా పక్ష భేటీలో ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నాం. సామ్రాట్‌ చౌధరీ శాసనసభా పక్ష నేతగా, ఉప నేతగా విజయ్‌ సిన్హా బాధ్యతలు చేపడతారు’’ అని తావ్‌డే వివరించారు. మరోవైపు జేడీయూ నేత సంజయ్‌ ఝా పట్నాలోని భాజపా ఆఫీస్‌కు చేరుకొన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.

ఉప ముఖ్యమంత్రి రేసులో సామ్రాట్‌, విజయ్‌ ముందున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సామ్రాట్‌.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. 

ముగిసిన జేడీయూ-ఆర్జేడీ బంధం.. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ రాజీనామా..

కొత్త ప్రభుత్వం నేటి సాయంత్రం కొలువుదీరే అవకాశం ఉంది. బిహార్‌ పరిణామాలపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ ‘‘నీతీశ్‌ కుమార్‌కు ధన్యవాదాలు. ఆయనకున్న ఇబ్బందులు ఏమైనప్పటికీ.. ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఆటవిక రాజ్యంతో ప్రజలు ఆందోళన చెందారు. తేజస్వీ యాదవ్‌ ఆ సీటులో (ముఖ్యమంత్రి పదవిలో) కూర్చుంటే పరిస్థితి మరింత దారుణంగా మారేది. అతడి కోసం నీతీశ్‌పై లాలూ తీసుకొస్తున్న ఒత్తిడి చూసి భయపడ్డాను. రాష్ట్రంలో ఆ పరిస్థితులను భాజపా ఏమాత్రం అనుమతించదు’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని