
అసోం ఎన్నికలు.. భాజపా మేనిఫెస్టో విడుదల!
గువహటి: అసోం శాసనసభ ఎన్నికలకు అధికార భాజపా మేనిఫెస్టో ప్రకటించింది. గువహటిలో మంగళవారం ‘సంకల్ప్ పాత్ర’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నడ్డాతో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం సర్బానంద సోనోవాల్ నాయకుల నేతృత్వంలో అసోం అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. భాజపా మేనిఫెస్టోలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూడిన అంశాలను పొందుపరిచింది.
మేనిఫెస్టోలోని కొన్ని ముఖ్యమైన హామీలు
• బ్రహ్మపుత్ర నది నీటిని నిల్వ చేసుకుని వినియోగించుకునేందుకు నదిపై పలు రిజర్వాయర్లు నిర్మాణం.
• అర్హులైన 30లక్షల కుటుంబాలకు అరుణోదయ పథకం కింద నెలకు రూ.3వేల ఆర్థిక సాయం.
• ప్రభుత్వ రంగంలో రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి. 2022 మార్చి 31లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ. అంతేకాకుండా ప్రైవేటు రంగంలో 8లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కృషి.
• అసోం భద్రత కోసం సవరణలతో కూడిన ఎన్‌ఆర్‌సీపై పనిచేసి.. అక్రమ చొరబాటుదార్లను కనుగొనడం ద్వారా నిజమైన భారతీయ పౌరులకు రక్షణ.
• మిషన్ శిశు ఉన్నయన్ పథకం కింద బాలలకు నాణ్యమైన విద్య. ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ.
• భారతీయ పౌరులందరికీ భూ హక్కులు కల్పించడంతో పాటు విద్య, మౌలిక సౌకర్యాలు, ఆరోగ్యం, మహిళా సాధికారతకు పలు కార్యక్రమాలు చేపడతామని పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.