గుజరాత్‌ ఎన్నికల కోసమే ఆ అస్త్రం ప్రయోగిస్తున్నారు: భాజపాపై మమత ఫైర్‌

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly polls)ను దృష్టిలో ఉంచుకొని భాజపా పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక (NRC)లను ఉయోగిస్తోందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శించారు.

Published : 10 Nov 2022 01:24 IST

కృష్ణానగర్‌: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly polls)ను దృష్టిలో ఉంచుకొని భాజపా పౌరసత్వ సవరణ చట్టం(CAA), జాతీయ పౌర పట్టిక (NRC)లను ఉయోగిస్తోందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శించారు. బెంగాల్‌లో సీఏఏని ఎప్పటికీ అమలు జరగనివ్వబోమని మరోసారి ఆమె స్పష్టంచేశారు.  బెంగాల్‌ను ఎప్పటికీ ముక్కలు కానివ్వబోమని తేల్చి చెప్పారు. గురువారం కృష్ణానగర్‌లో నిర్వహించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో దీదీ మాట్లాడారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారీ భాజపా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అంశాలపై మాట్లాడుతుంటుందని.. డిసెంబర్‌లో గుజరాత్‌ ఎన్నికలు, మరో ఏడాదిన్నరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో సీఏఏ అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని మమత  మండిపడ్డారు.

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాల్లో నివసించే రాజ్‌బన్షీలు, గూర్ఖాలను రెచ్చగొట్టడం ద్వారా  వేర్పాటువాదాన్ని భాజపా ప్రేరేపిస్తోందని మండిపడ్డారు. 2024 జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా తిరిగి అధికారంలోకి రాదని దీదీ పునరుద్ఘాటించారు. 2019లో రాజకీయ పరిస్థితులు వేరేగా ఉండేవని.. అప్పటినుంచి మారుతూ వస్తున్నాయన్నారు. బిహార్‌, ఝార్ఖండ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అప్పుడు భాజపా అధికారంలో ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ పార్టీ ఉనికి తగ్గుతోందని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో భాజపా ప్రభావం తగ్గిపోతుండటం వల్లే ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీలపై దాడులకు దిగడం, ప్రతిపక్ష నేతలను దూషిస్తూ అరెస్టులు చేయించడం వంటి చర్యలకు దిగుతోందని  ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని