BJP Meet: 23 ఏళ్లుగా ప్రభుత్వాధినేతను.. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు: ప్రధాని మోదీ

ప్రభుత్వం చేపట్టిన పనులు, దేశాభివృద్ధి తదితర అంశాల చుట్టూ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకృతం చేయాలని భాజపా శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Updated : 17 Feb 2024 17:31 IST

దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) 370కుపైగా సీట్లను గెలవడమే జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు డా.శ్యామాప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అని భాజపా శ్రేణులనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. పేదల సంక్షేమం, దేశాభివృద్ధి, అంతర్జాతీయ వేదికపై పెరిగిన భారత ప్రాభవం తదితర అంశాల చుట్టూ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకృతం చేయాలని పిలుపునిచ్చారు. దిల్లీలో రెండు రోజుల భాజపా (BJP) జాతీయ మండలి సమావేశాల ప్రారంభానికి ముందు నిర్వహించిన పార్టీ జాతీయ పదాధికారుల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘‘ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు అనవసరమైన, భావోద్వేగ సమస్యలను లేవనెత్తుతాయి. అయితే.. దేశాభివృద్ధి, పేదల అనుకూల విధానాలు, అంతర్జాతీయ వేదికపై భారత్‌ సాధించిన విజయాలు తదితర అంశాలను పార్టీ సభ్యులు ప్రచారంలో ప్రస్తావించాలి’’ అని ప్రధాని మోదీ చెప్పారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వెల్లడించారు. కేంద్ర పథకాల లబ్ధిదారులతో మమేకమయ్యేందుకు ఫిబ్రవరి 25 నుంచి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

భాజపాకు అతిపెద్ద ముప్పు మానుంచే : కేజ్రీవాల్‌

గతంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం దేశ ప్రధానిగా కలిపి దాదాపు 23 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉన్నానని, ఇంత సుదీర్ఘకాలంలో తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది ఆరోపణల రహిత, వికాసంతో కూడిన కాలమని చెప్పారు. ఇదిలా ఉండగా.. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను కల్పించే ‘ఆర్టికల్ 370’ను ముఖర్జీ వ్యతిరేకించారు. 2019 ఆగస్టులో మోదీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని