Kishan Reddy: దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలదే: కిషన్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్‌ పెంపు జీవో తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలదేనని పేర్కొన్నారు.

Updated : 29 Mar 2022 16:21 IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్‌ పెంపు జీవో తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలదేనని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఓటమి తర్వాతే సీఎం కేసీఆర్‌కు ధాన్యం గుర్తుకొచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలులో ఏపీకి ఏ ఇబ్బందీ లేదని.. మరి తెలంగాణకే ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేసినా ఏమీ ఇవ్వలేదని చెప్పడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో చివరి గింజ వరకూ కేంద్రం కొంటుందని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో కిషన్‌రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. భాజపాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే కేసీఆర్‌ తిరుగుతున్నారే తప్ప, రైతుల మీద ప్రేమతో కాదని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బాయిల్డ్‌ రైస్‌ కోసం మిల్లర్లతో మాట్లాడాలని కిషన్‌ రెడ్డి సూచించారు.

‘‘బియ్యం కొనేందుకు రూ. 25 వేల కోట్లు కాదు.. రూ. 35 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నూకల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. హుజూరాబాద్ ఎన్నికల ముందు అగ్రిమెంట్‌ చేసుకొని ఇప్పుడు తొండి ఆటలు ఎందుకు ఆడుతున్నారు? మెడమీద కత్తి ఎవరు పెట్టారు? అప్పుడు ప్రజలకు, రైతులకు ఎందుకు చెప్పలేదు? గతేడాది కేంద్రానికి ఇవ్వాల్సిన స్టాక్ ఇప్పటివరకు అందించలేదు. ధాన్యం చివరి గింజ వరకు కొంటాం. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను బలిపశువులను చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోనె సంచులకు కూడా కొనడం లేదు. బియ్యం కోసం కేంద్రం రూ. 36 ఇస్తుంటే.. రాష్ట్రం 3 రూపాయలే ఇస్తుంది. కేంద్రం కందిపప్పును ఉచితంగా పంపిస్తే రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. వ్యవసాయ మోటార్లకు ఎక్కడ కూడా మీటర్లు పెడతామంటూ చెప్పలేదు. దానికి సంబంధించి ఏవైనా పేపర్లు ఉంటే చూపించాలని తెరాస నేతలను ప్రజలు అడగాలి.

రిజర్వేషన్‌ విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా తీర్మానం చేసి పంపించారు. రిజర్వేషన్‌లు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. మిజోరాం, మణిపూర్‌లలో రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లు ఇస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు ఇవాళ సాయంత్రమే రిజర్వేషన్ల జీవో విడుదల చేస్తే అడ్డుకోం. కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోదు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తగిన నిబంధనలు పాటించాలి. ఎంసీఐ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రపోజల్స్‌ సరిగా పంపించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలి. పట్టించుకోకపోతే వేరే రాష్ట్రాలకు తరలిపోతాయి’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని