kishanreddy: కాంగ్రెస్‌, భారాస పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ చూస్తే ఎవరు ఎవరికి బీ టీమో తెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  అన్నారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 03 Jul 2023 16:16 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌, భారాస రెండూ కుటుంబ పార్టీలేనని, ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎవరు ఎవరికి ‘బీ టీమో’ అందరికీ తెలుసని అన్నారు. దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల విపక్ష నేతలతోనూ అఖిలేశ్‌ భేటీ అయ్యారు. వీరిద్దరి తాజా భేటీ చూస్తే ఎవరు ఎవరికి బీ టీమో తెలుస్తుంది.’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్‌, భారాస గతంలో పొత్తులు పెట్టుకున్నాయని చెప్పిన కిషన్‌ రెడ్డి.. భాజపా మాత్రం భారాసతో కలిసి ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి పారిపోయిన వ్యక్తి రాహుల్‌గాంధీ అని ఎద్దేవా చేశారు. భాజపాను విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు. భాజపాకి కాంగ్రెస్‌ ఎంత దూరమో.. భారాస కూడా అంతే దూరమని వ్యాఖ్యానించారు.  ‘‘మేం గతంలో భారాసతో కలవలేదు.. భవిష్యత్‌లోనూ కలవబోం. కుటుంబపాలన, అవినీతిపై భాజపా పోరాటం కొనసాగుతుంది’’ అని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని