CM KCR: ఎమర్జెన్సీ దిశగా భాజపా వెళ్తోంది: సీఎం కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ విపక్షాల మద్దతు కూడగట్టేందుకు దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్‌తో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన అనంతరం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్: ఆర్డినెన్స్ తెచ్చి కేంద్ర ప్రభుత్వం దిల్లీ ప్రజలను అవమానిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై జరుపుతున్న పోరాటానికి విపక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. దిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో గళం విప్పాలని విపక్ష నేతలను కేజ్రీవాల్ కోరుతున్నారు. ఈ క్రమంలో భాగంగానే శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో వారు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్‌లతో కలిసి సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దిల్లీలో రెండు జాతీయ పార్టీలను మట్టికరిపించి అరవింద్ కేజ్రీవాల్ అద్భుత విజయం సాధించారు. దిల్లీ ప్రజా ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది. దిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్సు తెచ్చింది. ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని భాజపా వెళ్తోంది. ఎమర్జెన్సీని వ్యతిరేకించే భాజపా నేతలు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోదీ చూస్తున్నారు. రాజ్‌భవన్‌లు భాజపా రాష్ట్ర కార్యాలయాలుగా మారాయి. గవర్నర్ భాజపా స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. కర్ణాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా.. భాజపాకు బుద్ధి రాలేదు. త్వరలో దేశం మొత్తం కూడా భాజపాకు గుణపాఠం చెప్తుంది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలన్నీ ఏకం కావాలి: కేజ్రీవాల్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్దినెన్సు తెచ్చిందని మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారుల విషయంలో దిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును కూడా కేంద్రం లెక్క చేయడం లేదన్నారు. దిల్లీ ప్రజలను మోదీ సర్కార్ తీవ్రంగా అవమానిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా భాజపా అరాచకాలు పెరిగాయన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ భాజపాయేతర ప్రభుత్వాలను కూల్చుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఫొటోలు దిగేందుకే నీతిఆయోగ్ భేటీకి వెళ్లాల్సి వస్తోంది: మాన్
ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. దేశంలో నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గవర్నర్ వ్యవస్థను మోదీ సర్కారు పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. భాజపాయేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్లను వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామన్నారు. మరోవైపు నీతి ఆయోగ్ భేటీ బహిష్కరణపైనా భగవంత్‌మాన్ స్పందించారు. ఫొటోలు దిగేందుకే నీతిఆయోగ్ భేటీకి వెళ్లాల్సి వస్తోందన్నారు. నీతిఆయోగ్ ప్రతిపాదనలను కేంద్ర సర్కార్ పాటించదని, రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను వినదని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Watch: జుట్టుపట్టుకుని.. కిందపడి తన్నుకుని: లైవ్ డిబేట్లో నేతల కొట్లాట
-
Arvind Kejriwal: కూటమితోనే ఉంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు వివాదం వేళ కేజ్రీవాల్ స్పష్టత
-
Pawan Kalyan: మహేశ్-పవన్‌లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కన్నడ హీరో
-
Nara Brahmani: ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఎందుకు పనిచేస్తున్నారు?: నారా బ్రహ్మణి
-
Komati Reddy: స్పెషల్ ఫ్లైట్ పెడతా.. కర్ణాటక వెళ్దాం రండి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
-
Dhoni - Sreesanth: ధోనీ గురించి ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని విషయమదే: శ్రీశాంత్