ప్రజల్ని దోచుకునేందుకు ‘అదానీ’కి గుత్తాధిపత్యం.. కేంద్రంపై కాంగ్రెస్‌ విమర్శలు

Congress slams modi govt: ఎయిర్‌పోర్టులు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను అదానీ గ్రూప్‌ కట్టబెట్టడం ద్వారా ఆ గ్రూప్‌ గుత్తాధిపత్యం సాధించి.. ప్రజల్ని దోచుకుంటోందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది.

Published : 04 Mar 2023 19:15 IST

దిల్లీ: దేశ ప్రజల్ని దోచుకునేందుకు అదానీ గ్రూప్‌నకు (Adani group) ప్రభుత్వం గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టిందని కాంగ్రెస్‌ పార్టీ (Congress) విమర్శించింది. ఎయిర్‌పోర్టులు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలను వినియోగించే ప్రజల నుంచి ఆ గ్రూప్‌ భారీగా వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని దుయ్యబట్టింది. అదానీ వ్యవహారాన్ని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసేందుకే జేపీసీని కోరుతున్నామని, అంతే తప్ప ప్రధానిని ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రజల్ని అదానీ గ్రూప్‌ గ్రూప్‌ ఎలా దోచుకుంటుందో వివరించారు.

దేశంలోనే 11వ అత్యంత రద్దీ కలిగిన లఖ్‌నవూలోని చౌదరి చరణ్‌ సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్‌ నిర్వహిస్తోందని జైరాం రమేశ్‌ చెప్పారు. ఈ విమానాశ్రయంలో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీలను (UDF) భారీగా పెంచేందుకు ఆ కంపెనీ ప్రతిపాదించిందని తెలిపారు. ఒకవేళ ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఇందుకు ఆమోదం తెలిపితే.. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న యూజర్‌ ఛార్జీ రూ.192 నుంచి రూ.1025కి పెరుగుతుందన్నారు. అదే అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూడీఎఫ్‌ రూ.561 నుంచి రూ.2756కు పెరుగుతుందన్నారు. 

ఇప్పటికే అదానీ గ్రూప్‌ నిర్వహిస్తున్న అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో యూడీఎఫ్‌ ఛార్జీలను దేశీయ ప్రయాణికులకు 6 రెట్లు, అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించిన యూడీఎఫ్‌ ఛార్జీలు 12 రెట్లు పెంచేందుకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. అదానీ గ్రూప్‌ నిర్వహిస్తున్న మంగళూరు ఎయిర్‌పోర్లులో విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రయాణికులతో పాటు ఈ విమానాశ్రయంలో దిగే ప్రయాణికుల నుంచీ యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. నీతి ఆయోగ్‌, ఆర్థిక మంత్రిత్వ శాఖ అభ్యంతరం చెప్పినప్పటికీ.. ఆరు విమానాశ్రయాలను ఒక్కరికే (అదానీ గ్రూప్‌నకే) కట్టబెట్టాలన్న ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించాలా? అని జైరామ్‌ రమేశ్‌ ప్రశ్నించారు. ‘మీ క్రోనీలు ఎలక్ట్రోరల్‌ బాండ్ల ద్వారా భాజపాకు చెల్లించే మొత్తాన్ని వినియోగదారులు వారికి తమ జేబుల నుంచి బదిలీ చేయాలా?’ అని ప్రశ్నించారు.

హరియాణా ప్రభుత్వ రంగ విద్యుత్‌ పంపిణీ సంస్థలతో 2008లో అదానీ పవర్‌ కంపెనీ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కుదర్చుకుందని జైరాం రమేశ్‌ తెలిపారు. ఒక్కో యూనిట్‌కు రూ.2.94 చొప్పున 25 ఏళ్ల కాలానికి 1424 మెగావాట్ల విద్యుత్‌ను పంపిణీ చేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు. 2020 డిసెంబర్‌ నుంచి విద్యుత్‌ పంపిణీ నిలిపివేసిన ఆ కంపెనీ.. ఒక్కో యూనిట్‌ను రూ.11.55 చొప్పున కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తోందని చెప్పారు. హరియాణా సీఎం ఖట్టర్‌పై మళ్లీ ఒత్తిడి తెచ్చారా? హరియాణాలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలతో పీపీఏలు కుదర్చకున్నామని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈకి అదానీ గ్రూప్‌ తెలియజేసిందని, కానీ అలాంటి ఒప్పందమేదీ కుదరలేదని జైరాం రమేశ్‌ తెలిపారు. అదానీ షేర్ల ధరలు పెంచడమే దీని ఉద్దేశమన్నారు. దీనిపై సెబీ కళ్లు మూసుకుందని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు