ఆ పార్టీకి మరోపేరే మోసం: నడ్డా

అసోంలో మరోసారి ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భాజపా జాతీయాధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గువహటిలో విలేకరులతో మాట్లాడారు.

Published : 03 Apr 2021 12:51 IST

గువహటి: అసోంలో మరోసారి ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భాజపా జాతీయాధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గువహటిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై నడ్డా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు ప్రజాసేవ చేయడం తెలియదని.. ఆ పార్టీకి మరోపేరే మోసం చేయడం అని నడ్డా విమర్శించారు. 

‘గతంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉండి కూడా టీ తోట కార్మికుల కోసం ఒక్క మంచి పనీ చేయలేదు. వారు ఇక్కడ అధికారంలో ఉన్నన్ని రోజులు రాజకీయ పర్యాటకం కోసం మాత్రమే రాష్ట్రాన్ని వినియోగించుకున్నారు. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో అసోంకు కనీసం పది సార్లు కూడా రాలేదు. కానీ, నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రానికి 35 సార్లు వచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఆరు వైద్య కళాశాలలు మంజూరు చేశాం. అసోం సంస్కృతి రక్షణ, భద్రత, అభివృద్ధి ఈ మూడు అంశాలే ప్రధాన అజెండాగా మేం ఎన్నికల్లో పోరాడుతున్నాం. సంస్కృతి పరిరక్షణ విషయానికి వస్తే గతంలో వాజ్‌పేయీ హయాంలో గోపినాథ్‌ బోర్డోలోయికి, ఇప్పుడు మోదీ హయాంలో భూపేన్‌ హజారికాకు భారతరత్న పురస్కారాలతో సత్కరించాం’ అని నడ్డా గుర్తు చేశారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే!
పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా నందిగ్రామ్‌లో ఓడిపోబోతున్నారని నడ్డా అన్నారు. అందుకే ఆమె మరో స్థానంలో పోటీ చేయడం కోసం వెతుకుతున్నారని.. ఈ విషయాన్ని దీదీ మనుషులే తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు. ‘పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని తరిమేందుకు ప్రజలు ఆత్రుతగా ఉన్నారు. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే. బెంగాల్‌ ఫలితాలు వారికి దిమ్మతిరిగేలా చేస్తాయి. నందిగ్రామ్‌లోనూ దీదీకి ఓటమి తప్పదు. అందుకే ఆమె ఇంకో స్థానంలో పోటీ చేసేందుకు వెతుకుతున్నారని నాకు తెలిసింది’ అని నడ్డా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని