Andhra news: సీఎం జగన్‌ హిట్లర్‌ని మించిపోయారు: ధూళిపాళ్ల

సీఎం జగన్‌ హిట్లర్‌ని మించిపోయారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. సీఎం పర్యటన అంటేనే స్థానిక ప్రజలు.......

Published : 24 Sep 2022 02:13 IST

అమరావతి: సీఎం జగన్‌ హిట్లర్‌ని మించిపోయారని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. సీఎం పర్యటన అంటేనే స్థానిక ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బంది కలిగించేలా ఆర్టీసీ బస్సులన్నింటినీ సీఎం సభకు జనాన్ని తరలించేందుకు వాడటం దారుణమన్నారు. జనం తిరగబడతారనే భయంతోనే జగన్‌ ఎక్కడికి వెళ్లినా బారికేడ్లు పెట్టుకుంటున్నారని విమర్శించారు. త్వరలోనే ప్రజా తిరుగుబాటు తప్పదని, వైకాపాను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

‘‘పగ, విద్వేషం, విధ్వంసం, దోపిడీలతో జగన్ హిట్లర్‌ని మించిపోయానడంలో ఎలాంటి సందేహంలేదు. చరిత్రలో మనం చూశాం.. దొంగలు, బందిపోటు దొంగల్ని చూసి ప్రజలు భయపడేవారు. ఈరోజు ఏపీలో ప్రజానీకం సీఎం పర్యటన అంటేనే భయపడే పరిస్థితి. సీఎం ఎక్కడికి వెళ్తే అక్కడ డబుల్‌ బారికేడ్లు ఉంటాయి. దుకాణాలు మూసేస్తారు. వ్యాపారాలు మూసేస్తారు. బలవంతంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం ఒక ఎత్తయితే.. ఆ స్కూళ్ల నుంచి బలవంతంగా బస్సులు లాక్కొని జనాన్ని తరలించడానికి ఉపయోగిస్తున్నారు. సీఎం పర్యటనకు ప్రజలు రాకపోతే పథకాలు ఆపేస్తాం.. పెనాల్టీలు వేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ రకమైన దౌర్జన్యం కొనసాగుతోంది. జగన్ పర్యటనకు వెళ్తే అక్కడ కర్ఫ్యూ వాతావరణం కనబడుతుంది. ప్రజల్లోకి రావడానికి సీఎం భయపడుతున్నట్టు కనబడుతోంది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘జగన్‌.. నీకు బలం, బలగం ఉన్న పులివెందులలో పోటీ చేయడం గొప్పా? తన సామాజిక వర్గంలేని చోట, బలగం, బంధువులు, పరివారం లేనిచోట చంద్రబాబు పోటీచేయడం గొప్పా? ఏదో గొప్పో చెప్పాలి. ఇది బీసీ సీటు అంటూ బీసీల గురించి ఈరోజు సీఎం కుప్పంలో చాలా మాట్లాడారు. బీసీలపై అంతప్రేమ ఉంటే చిత్తూరు జిల్లాలో మంత్రులెవరు? రెండూ నీ సామాజికవర్గానికే ఎందుకు ఇచ్చారు? ఒకవైపు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరోవైపు రోజారెడ్డికే మంత్రిపదవులు ఇచ్చారు. మరి అప్పుడు బీసీలు కనబడలేదా? కుప్పం వచ్చి బీసీ జపం చేస్తే జనం నమ్ముతారా?’’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని