DK Aruna: కాంగ్రెస్‌ ముందు ఆ మూడు గ్యారంటీలు ఇవ్వాలి: డీకే అరుణ

ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు.

Updated : 19 Sep 2023 14:25 IST

హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని ఆమె ఆరోపించారు. దేశంలో వైషమ్యాలు సృష్టించి అభివృద్ధికి ఆటంకాలు కల్పించడం తగునా? అని ప్రశ్నించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు.

‘‘దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ విశ్వాసం కోల్పోయింది. మత విద్వేషాల పేరుతో భాజపాను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తోంది. అధికారంలో ఉన్న కర్ణాటకలో రూ.4వేల పింఛన్‌ ఇస్తున్నారా? కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేస్తున్నారా? కర్ణాటకలో ఆర్టీసీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. అక్కడ ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ముందు మూడు గ్యారంటీలు ఇవ్వాలి. గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరని, కుంభకోణాలు చేయబోమని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించబోమని గ్యారంటీ ఇవ్వాలి. 

మహిళలను గౌరవించే అలవాటు కేసీఆర్‌కు లేదు. భారాస కమిటీల్లో ఎక్కడైనా మహిళలకు కీలక బాధ్యత ఉందా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో నా శ్రమ కూడా ఉంది. ఆ ప్రాజెక్టు కోసం కృషి చేసిన నన్ను గౌరవించకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌, భారాస, మజ్లిస్‌ తోడు దొంగలు.. భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని డీకే అరుణ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని