‘స్థానిక’ పోరులో డీఎంకే భారీ విజయం.. చెన్నైలో క్లీన్‌స్వీప్‌!

తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే హవా కొనసాగుతోంది. చెన్నై కార్పొరేషన్‌లో క్లిన్‌స్వీప్‌ దిశగా దూసుకెళ్తోంది. అన్నాడీఎంకేకు కంచుకోటగా....

Updated : 22 Feb 2022 21:28 IST

చెన్నై: తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార డీఎంకే హవా కొనసాగుతోంది. చెన్నై కార్పొరేషన్‌లో క్లిన్‌స్వీప్‌ దిశగా దూసుకెళ్తోంది. అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న పశ్చిమ తమిళనాడులోనూ డీఎంకే జోరే కొనసాగుతోంది. కోయంబత్తూరులో 75 శాతానికిపైగా స్థానాల్లో అధికార పార్టీ విజయకేతనం ఎగురవేసింది. సాయంత్రం వరకు వెలువడిన ఫలితాల ప్రకారం..  రాష్ట్రంలోని కార్పొరేషన్లలో మొత్తం 1374 వార్డులకు గాను 425 స్థానాల్లో డీఎంకే జయభేరి మోగించగా.. 75చోట్ల అన్నాడీఎంకే గెలుపొందింది. అలాగే, పురపాలికల్లో 3843 వార్డు సభ్యుల సీట్లకు గాను డీఎంకే 1832 గెలుచుకోగా.. అన్నాడీఎంకే 494 స్థానాలకే పరిమితమైంది. అలాగే, 7621 పట్టణ పంచాయతీలకు గాను 4261 చోట్ల డీఎంకే గెలుపొందగా.. అన్నాడీఎంకే 1178 చోట్ల విజయం సాధించింది.

చెన్నైలో డీఎంకే క్లీన్‌స్వీప్‌..

ఇకపోతే, చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 200 వార్డులకు గాను 192 స్థానాల ఫలితాలు వెలువడగా.. 146చోట్ల డీఎంకే గెలుపొందగా.. అన్నాడీఎంకే కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. 3 వార్డుల్లో గెలుపుతో కాంగ్రెస్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు ఇటీవల ఎన్నికలు పూర్తి కాగా.. ఈ రోజు ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 

సుపరిపాలనకు ఇదో సర్టిఫికెట్‌: స్టాలిన్‌

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ భారీ స్థానాల్ని కైవసం చేసుకోవడంపై తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్‌ హర్షం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తొమ్మిది నెలల సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్‌గా పేర్కొన్నారు. ద్రవిడియన్‌ మోడల్‌కు ఇదో గుర్తింపు అనీ.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్ని సాకారం చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలు తమపట్ల ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం తన తండ్రి కరుణానిధి సమాధి వద్దకు కుటుంబ సభ్యులతో వెళ్లి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు