Shiv Sena: శిందే వర్గమే అసలైన శివసేన.. స్పీకర్‌ నిర్ణయం

శివసేనలోని రెండు చీలిక వర్గాల మధ్య పోరాటంలో ఉద్ధవ్‌ వర్గానికి గట్టి షాక్‌ తగిలింది. 

Updated : 10 Jan 2024 19:59 IST

ముంబయి: మహారాష్ట్రలోని శివసేన (Shiv Sena)లో రెండు చీలిక వర్గాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉద్ధవ్‌ ఠాక్రేకు ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఆదేశాలు వెలువరించారు. శివసేన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఉద్ధవ్‌, ఏక్‌నాథ్‌ శిందే వర్గాల పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. శిందే వర్గానికే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న స్పీకర్‌.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ తిరస్కరించారు. అలాగే, శివసేన పార్టీ 2018 రాజ్యాంగాన్ని పరిగణించాలన్న ఉద్ధవ్‌ వర్గం అభ్యర్థనను స్పీకర్‌ తోసిపుచ్చారు. ఎన్నికల కమిషన్‌కు 1999లో సమర్పించిన ఆ పార్టీ  రాజ్యాంగమే చెల్లుబాటవుతుంది.. దాని ప్రకారం శివసేన ప్రముఖ్‌ (ఉద్ధవ్‌ ఠాక్రే)కు ఏ నేతనూ తొలగించే అధికారం లేదని తేల్చి చెప్పారు.

ఉద్ధవ్‌ Vs శిందే.. ఎప్పుడెప్పుడేం జరిగింది?

2022 జూన్‌లో ఏక్‌నాథ్‌ శిందే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో శివసేనలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. తనకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలతో అస్సాంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసిన శిందే.. ఆ తర్వాత భాజపాకు తన మద్దతు ప్రకటించారు. సుప్రీంకోర్టు అనుమతితో ఉద్ధవ్‌ ఠాక్రే బలపరీక్షలో తన మెజార్టీని నిరూపించుకోవాలని గవర్నర్‌ కోరగా.. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత శివసేనలో శిందే వర్గం- భాజపా కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జూన్‌ 30న ఏక్‌నాథ్‌ శిందే మహారాష్ట్ర కొత్త సీఎంగా నియమితులయ్యారు. 2022 జులై 4న ఏక్‌నాథ్‌ శిందే అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గారు. అయితే, అప్పటివరకు శివసేన పార్టీ ఎన్నికల గుర్తుగా ఉన్న విల్లు, బాణం గుర్తును 2022 అక్టోబర్‌లో స్తంభింపజేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో దాన్ని ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి కేటాయించింది.

ఈ పరిణామాలన్నింటిపై ఉద్ధవ్‌ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఉద్ధవ్‌ ఠాక్రే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోవడానికి ముందే రాజీనామా చేసినందున ఏక్‌నాథ్‌ శిందే సారథ్యంలోని ప్రభుత్వంపై అనర్హత వేటు వేయలేమని, ఉద్ధవ్‌ను తిరిగి సీఎంగా నియమించలేమని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం గతేడాది మే నెలలో తీర్పు ఇచ్చింది. అలాగే, సీఎం శిందే వర్గ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై 2024 జనవరి 10లోగా నిర్ణయం తీసుకోవాలని డిసెంబర్‌ 15న మహారాష్ట్ర స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్‌లైన్‌ నేటితో ముగియనున్న నేపథ్యంలో స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు