రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్న భాజపాను ఓడించడమే ఎజెండా

రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్‌ రాజేష్‌ లిలోతియా పిలుపునిచ్చారు.

Updated : 05 May 2024 06:53 IST

ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్‌ రాజేష్‌ లిలోతియా
గాంధీభవన్‌లో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తేయాలని కుట్రలు పన్నుతున్న భాజపాను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించడమే ఎజెండాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్‌ రాజేష్‌ లిలోతియా పిలుపునిచ్చారు. కులగణన, రిజర్వేషన్ల పెంపు, దళితుల సంక్షేమం-అభివృద్ధికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు భాజపా కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ పీసీసీ ఎస్సీ విభాగం శనివారం గాంధీభవన్‌లో ‘రాజ్యాంగ పరిరక్షణ దీక్ష’ చేపట్టింది. ఆ విభాగం అధ్యక్షుడు నాగరిగారి ప్రీతం అధ్యక్షతన జరిగిన దీక్షలో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌, సతీష్‌ మాదిగ, గజ్జెల కాంతం, మానవతారాయ్‌, ఊట్ల వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, పీసీసీ ఓబీసీ సెల్‌ ఛైర్మన్‌ నూతి శ్రీకాంత్‌గౌడ్‌ తదితరులు సంఘీభావం తెలిపారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష జరిగింది. దీక్ష చేపట్టినవారికి రాజేష్‌ లిలోతియా నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మారుస్తామన్న భారాసను తెలంగాణ ప్రజలు ఇంటికి పంపించారని, రద్దు చేయాలని చూస్తున్న భాజపాను లోక్‌సభ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. మాదిగ, మాదిగ ఉపకులాలు, హక్కులు.. ఇవన్నీ రాజ్యాంగం ఉంటేనే సాధ్యమవుతాయన్నారు. వీహెచ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమన్న విషయాన్ని ప్రచారంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలో అసమానతలు తొలగిపోయి, రిజర్వేషన్లు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

మధుయాస్కీగౌడ్‌ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల కులవివక్షతోనే చనిపోయారని, అతను దళితుడు కాదని పోలీసులు నివేదిక ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు ఎత్తేయాలన్న మోదీ కుట్రలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఛేదించారన్నారు. ఎ.చంద్రశేఖర్‌, ప్రీతం, సతీష్‌ మాదిగ, గజ్జెల కాంతం, మానవతారాయ్‌ తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగం రద్దుకు కుట్ర చేస్తున్న భాజపాకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగమే లేకపోతే ఎస్సీ వర్గీకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసినా, రిజర్వేషన్లు తీసేసినా మంద కృష్ణకు, మోత్కుపల్లి నర్సింహులుకు అభ్యంతరం లేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని