కులగణనకు కట్టుబడి ఉన్నాం: సీఎం

కులగణనకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

Published : 05 May 2024 06:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: కులగణనకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని, బీసీలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర బీసీ సంఘాల నేతలు శనివారం సీఎంను తన నివాసంలో కలిసిన సందర్భంగా ఆయన వారితో భేటీ అయ్యారు. సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న హామీ మేరకు కులగణన చేపట్టడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి, రూ.150 కోట్ల బడ్జెట్‌ కూడా కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే కులగణన చేపట్టి బీసీ కులాల లెక్కలు సేకరిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో సమగ్ర కులగణన చేపడతామని హామీ ఇచ్చిందని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచడమే కాకుండా మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఉప కోటా, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు తదితర డిమాండ్లను నెరవేర్చడానికి రాహుల్‌ గాంధీ కంకణబద్ధులై ఉన్నారని సీఎం వివరించారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన ఫైలుపై మొదటి సంతకం చేస్తామని రాహుల్‌ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చినందున బీసీలంతా పార్టీకి అండగా నిలవాలని సంఘాల నేతలను కోరారు. బీసీల ఆకాంక్షలను, డిమాండ్లను నెరవేర్చి వారికి రాజకీయ రిజర్వేషన్లు పెంచడానికి, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉండడాన్ని తాము స్వాగతిస్తున్నామని పార్టీకి బీసీలంతా అండగా ఉంటారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సీఎంను కలిసిన వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ కో ఛైర్మన్‌ చిన్న శ్రీశైలంయాదవ్‌, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ ముదిరాజ్‌, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్‌, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్‌,  భాస్కర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని