రోహిత్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి: కూనంనేని

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

Published : 05 May 2024 06:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ నివేదిక ఇవ్వడం విస్మయం కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈ కేసు పునర్విచారణకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోహిత్‌ తల్లి రాధికకు హామీ ఇవ్వడం హర్షణీయం. రోహిత్‌ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. ‘వర్సిటీ వీసీ, ఏబీవీపీ నాయకుల వేధింపుల కారణంగానే రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వారికి అనుకూలంగా పోలీసు నివేదిక ఉండటం దిగ్భ్రాంతి కలిగించింది’ అని పేర్కొన్నారు.

సమగ్ర విచారణ జరిపించాలి: తమ్మినేని

రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసును రాజకీయ అంశంగా చూడకుండా సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు ఏ యూనివర్సిటీలోనూ పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిందితులుగా ఉన్న భాజపా నేతలు, హెచ్‌సీయూ వైస్‌ ఛాన్సలర్‌పై కేసులను ఎత్తివేయించడానికే తప్పుడు నివేదికలు ఇచ్చారని సీపీఎం భావిస్తోందని చెప్పారు. కేసును పునర్విచారణ చేపడుతున్నట్టు రాష్ట్ర డీజీపీ ప్రకటించడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని