ప్రజ్వల్‌ రేవణ్న బాధితులకు అండగా నిలుద్దాం

జనతాదళ్‌(ఎస్‌) ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సూచించారు.

Updated : 05 May 2024 06:52 IST

కర్ణాటక ముఖ్యమంత్రికి రాహుల్‌ గాంధీ లేఖ
ప్రధాని మోదీపైనా కాంగ్రెస్‌ నేత పరోక్ష విమర్శలు

దిల్లీ: జనతాదళ్‌(ఎస్‌) ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్న లైంగిక వేధింపులకు గురైన బాధితులందరికీ సాయం అందించాలని, వారికి న్యాయం జరిగే వరకూ అండగా నిలవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సూచించారు. ఈ మేరకు ఆయన లేఖ రాస్తూ...నిందితుడి చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆశీస్సులతోనే ప్రజ్వల్‌ రేవణ్న విదేశాలకు పారిపోగలిగారని రాహుల్‌ ఆరోపించారు. మహిళలపై జరిగిన ఘోర దారుణాలకు స్పందించకుండా నిరంతరంగా మౌనం వహిస్తున్న సీనియర్‌ ప్రజాప్రతినిధిని తానెన్నడూ చూడలేదంటూ ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ప్రజ్వల్‌ రేవణ్న  దురాగతాలు గత ఏడాది డిసెంబరులోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి వెళ్లాయన్నారు. భాజపా అగ్రనాయకత్వానికి ఈ విషయం తెలిసినా సామూహిక అత్యాచార నిందితుడి తరఫున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తనను నిర్ఘాంతపరిచిందని తెలిపారు. హరియాణాలో మహిళా రెజ్లర్ల ఆరోపణలను, మణిపుర్‌ మహిళలపై అకృత్యాలను ప్రస్తావిస్తూ...ఈ అన్ని ఘటనల్లోనూ నేరగాళ్లకు ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నట్లుగా ఉందని, అందుకే ఈ దారుణాలపై మౌనం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. అనాగరిక చర్యలకు పాల్పడిన నిందితులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం మనందరి బాధ్యత అని రాహుల్‌ పేర్కొన్నారు. ఈ లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని