Sachin Pilot: కాంగ్రెస్‌ హెచ్చరించినా.. దీక్షకు కూర్చున్న సచిన్‌ పైలట్‌

రాజస్థాన్‌ (Rajasthan) కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం కలకలం రేపుతోంది.

Updated : 11 Apr 2023 15:27 IST

జైపుర్‌: రాజస్థాన్‌ (Rajasthan)లో గత భాజపా ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) మంగళవారం నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ విషయంలో పైలట్‌ నిర్ణయాన్ని పార్టీ వ్యతిరేకించినా.. ఆయన దీక్ష చేపట్టడం రాజస్థాన్‌ కాంగ్రెస్‌ (Congress)ను కలవరపెడుతోంది. జైపుర్‌లోని షాహీద్‌ స్మారక్‌ వద్ద పైలట్‌, తన మద్దతుదారులతో కలిసి దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకు ఆయన ఈ నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. అంతకుముందు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద పైలట్‌ నివాళులర్పించారు. (Sachin Pilot sits on Fast)

మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై చర్యలు తీసుకోవడంలో సీఎం అశోక్‌ గహ్లోత్‌ (ashok gehlot) ప్రభుత్వం విఫలమైందని పైలట్‌ (Sachin Pilot) ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ కేసులపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్న ఆయన.. తాను ఒక రోజు దీక్ష చేపట్టనున్నట్టు ఆదివారం ప్రకటించారు. అయితే, పైలట్‌ తీరుపై కాంగ్రెస్‌ (Congress) అసహనం వ్యక్తం చేసింది. ఆయన దీక్ష పార్టీ వ్యతిరేక చర్య కిందకే వస్తుందని ఏఐసీసీ రాజస్థాన్‌ ఇన్‌ఛార్జ్‌ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రణ్‌ధావా హెచ్చరించారు. అయినప్పటికీ పైలట్‌ (Sachin Pilot) దీక్ష చేపట్టడం గమనార్హం. అయితే, పార్టీ హెచ్చరికలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

కాగా.. మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. సొంత పార్టీలోనే మరోసారి ధిక్కార స్వరం వినిపించడం కాంగ్రెస్‌ (Congress)కు ఇబ్బందికర పరిణామంగా కనిపిస్తోంది. గహ్లోత్‌, పైలట్‌ వర్గాల్లో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతుండగా.. అధిష్ఠానం వారికి సర్దిచెబుతూ వస్తోంది. తాజాగా గహ్లోత్‌ సర్కారుపై పైలట్ దీక్షకు దిగడం పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.

కాంగ్రెస్‌కు బహిరంగ సవాల్‌: భాజపా

ఈ పరిణామాలపై స్పందించిన భాజపా (BJP).. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించింది. ‘‘సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) కాంగ్రెస్‌ హైకమాండ్‌కు బహిరంగంగా సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. దేశవ్యాప్తంగా ఆ పార్టీ తన ఉనికిని కోల్పోతోంది’’ అని రాజస్థాన్‌ అసెంబ్లీ ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్‌ దుయ్యబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని