Supriya Sule: ఫడణవీస్‌ రాజీనామా చేయాలి.. సూలే డిమాండ్

మరాఠా రిజర్వేషన్‌ పోరాటంలో భాగంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఆందోళన వ్యక్తంచేశారు.

Updated : 30 Oct 2023 20:17 IST

దిల్లీ: మరాఠా వర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు (Maratha reservation) కల్పించాలంటూ చేపట్టిన ఆందోళనలు హింసకు దారితీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్‌ చేశారు. బీడ్‌లో ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటిని ఆందోళనకారులు తగలబెట్టడం.. మున్సిపల్‌ కౌన్సిల్‌ భవనంలోని మొదటి అంతస్తుకు నిప్పంటించి ధ్వంసం చేయడం వంటి ఘటనలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలపై సుప్రియా సూలే దిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

భగ్గుమన్న ‘మరాఠా కోటా’ ఆందోళనలు.. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు!

‘‘మహారాష్ట్ర హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా చేయాలి. ఈ హింసను చూడండి.. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది? ఒక ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టారు. ఒక పంచాయతీ సమితి కార్యాలయాన్ని తగలబెట్టారు. ఎవరైనా శాంతిభద్రతల్ని కాపాడాలని చూస్తున్నారా?’’ అని సూలే ప్రశ్నించారు.  మరాఠా సంఘం నిరసనల నేపథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న సీఎం ఏక్‌నాథ్‌ శిందే నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు. మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ సామాజిక కార్యకర్త మనోజ్‌ జరంగే అల్టిమేటం జారీ చేసిన 40 రోజుల తర్వాత సీఎం ఈ నిర్ణయం ప్రకటిస్తారా? అని విమర్శించారు.  ఇది జరంగేతో పాటు అన్ని వర్గాల ప్రజలందరినీ ఇది మోసగించడం కాదా? ఒకదాని తర్వాత మరో కమిటీ ఏర్పాటు చేయడంలో అర్థమేంటి? అని సుప్రియా సూలే ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని