Maratha reservation: భగ్గుమన్న ‘మరాఠా కోటా’ ఆందోళనలు.. ఎమ్మెల్యే ఇంటికి నిప్పు!

మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు చేస్తూ మహారాష్ట్రలో జరుగుతోన్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో ఎన్‌సీపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

Published : 30 Oct 2023 15:21 IST

ముంబయి: విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు (Maratha reservation) కల్పించాలని డిమాండు చేస్తూ మహారాష్ట్రలో రెండోదఫా జరుగుతోన్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో బీడ్‌లో ఉన్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ సోలంకే నివాసంపై నిరసనకారులు దాడి చేసి నిప్పుపెట్టారు. దీంతో ఇల్లు మొత్తం దగ్ధమైంది. దాడి సమయంలో ఎమ్మెల్యే ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈ ఘటనలో తనతోపాటు కుటుంబీకులు, సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

‘దాడి జరిగిన సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. అదృష్టవశాత్తు కుటుంబీకులు, సిబ్బంది ఎవ్వరికీ గాయాలు కాలేదు. మేమందరం సురక్షితంగా బయటపడ్డాం. కానీ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది’ అని ఎన్‌సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ సోలంకే పేర్కొన్నారు. మరోవైపు, హోంమంత్రిత్వ శాఖ, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే ఆరోపించారు.

శతాధిక పార్టీకి నిధుల కొరత.. 2024 ఎన్నికల కోసం క్రౌడ్‌ ఫండింగ్‌..!

మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే స్పందించారు. ఈ నిరసనలు ఎటువైపు వెళ్తున్నాయో అనే విషయాన్ని మనోజ్‌ జరంగే పాటిల్‌ (మరాఠా రిజర్వేషన్ల కార్యకర్త) గమనించాలని అన్నారు. అవి తప్పుడు మార్గంలో వెళ్తున్నాయని సీఎం శిందే స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

ఇదిలాఉంటే, మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండు చేస్తూ సామాజిక కార్యకర్త మనోన్‌ జరంగే పాటిల్‌ (Manoj Jarange).. అక్టోబర్‌ 25 నుంచి జాల్నా జిల్లాలోని అంతర్వాలీ సారథి గ్రామంలో ఆమరణ దీక్ష చేపట్టారు. ఏ రాజకీయ నాయకుడిని గ్రామంలోకి అనుమతించవద్దని పాటిల్‌ కోరడంతో గ్రామస్థులు లోనికి ఏ రాజకీయ పార్టీ నేతనూ రానివ్వడం లేదు. వైద్య పరీక్షలు చేసేందుకు జిల్లా అధికారులు, వైద్యులు ప్రయత్నిస్తున్నప్పటికీ అందుకు ఆయన నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న సమయంలోనే.. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని