రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబ్యాలెట్‌ పెట్టండి:తెదేపా

తెదేపా శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,

Updated : 19 Jan 2020 20:22 IST

ముగిసిన తెదేపా శాసనసభాపక్ష సమావేశం

అమరావతి: తెదేపా శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఎలాంటి వైఖరి అవలంబించాలనేదానిపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం అనంతరం తెదేపా శాసనసభాపక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామని.. రేపు సభలోనూ ఒకే రాజధాని..ఒకే అసెంబ్లీకి అనుకూలంగానే తమ వాదనను బలంగా వినిపిస్తామన్నారు. కార్యాలయాల తరలింపుతో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఒరిగేదేమీ ఉండదన్నారు. విశాఖ ఇప్పటికే ఆర్థిక రాజధానిగా మారిందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని ఆయన వివరించారు. పోలీసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. ప్రజాగ్రహం ముందు ప్రభుత్వం ఆటలు సాగవన్నారు. వైకాపా మేనిఫెస్టోలో అమరావతి మార్పు గురించి చెప్పారా? అని సీఎం జగన్‌ను రామానాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజాబ్యాలెట్‌ ద్వారా అభిప్రాయాలను సేకరించి రాజధానిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకానీ నిరంకుశంగా వ్యవహరిస్తూ రాజధాని మార్చే ప్రయత్నం చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని