మూడు రాజధానుల వ్యూహానికి జగన్‌ పదును

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదానికి శాసనమండలిలో ఎదురుదెబ్బ తగలడంతో భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది.   ఎట్టి పరిస్ధితుల్లోనూ రాష్ట్రంలో 3 రాజధానులు

Updated : 23 Jan 2020 12:14 IST

అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదానికి శాసనమండలిలో ఎదురుదెబ్బ తగలడంతో భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది.   ఎట్టి పరిస్ధితుల్లోనూ రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టాలని పట్టుదలగా ముందుకు వెళ్లిన ప్రభుత్వానికి శాసన మండలి నిర్ణయం శరాఘాతంగా మారింది. దీనిపై ఏం చేద్దామనే విషయమై పార్టీ ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతో సీఎం జగన్ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం, పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో  సుమారు గంట పాటు చర్చించారు. 

శాసన మండలిలో నిన్న జరిగిన పరిణామాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు శాసనమండలిలో ఆమోదం పొందకపోవడంపై విశ్లేషించినట్లు తెలిసింది. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసన మండలి నిర్ణయించిన దృష్ట్యా ప్రభుత్వ పరంగా తదుపరి వ్యూహంపై చర్చించారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు సీఎం   తీసుకున్నట్లు సమాచారం. రాజధాని రైతులు వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు రానున్న దృష్ట్యా  ఆ అంశంపైనా సుప్రీం కోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గీతో సీఎం ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ వైఖరిని సీఎం సవివరంగా తెలియజేసినట్లు సమాచారం.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని