అసమ్మతులను బుజ్జగించే పనిలో కాంగ్రెస్‌!

జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో రసకందాయంలో పడ్డ మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తమ ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు ఇటు భాజపా......

Published : 11 Mar 2020 17:49 IST

భోపాల్‌: జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో రసకందాయంలో పడ్డ మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తమ ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు ఇటు భాజపా, అటు అధికార కాంగ్రెస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో జైపుర్‌ లేదా మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి తమ సభ్యుల్ని తరలించే యోచనలో ఉన్నామని ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ సభ్యుడు తెలిపారు. తమ సొంత సభ్యులతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేలపైనా కాంగ్రెస్‌ పెద్దలు దృష్టి సారించారు. నిన్న 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. 

అధికారాన్ని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బెంగళూరులో అసమ్మతి సభ్యుల్ని బుజ్జగించేందుకు ఇంకా యత్నాలు చేస్తూనే ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇద్దరు సీనియర్‌ నాయకుల్ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలు కచ్చితంగా తిరిగొస్తారని కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడు డీ.కె.శివకుమార్‌ అనడం గమనార్హం. మరోవైపు ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకొని తీరతామని వ్యాఖ్యానించారు. మరోవైపు బెంగళూరు శిబిరంలో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేల్లో 10 మంది భాజపాలో చేరేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. కేవలం సింధియా కోసమే తాము బెంగళూరు వచ్చామని.. భాజపాలో చేరడానికి కాదని వారు వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

మరోవైపు ఇప్పటికే భాజపా మంగళవారం రాత్రి తమ ఎమ్మెల్యేల్ని హరియాణాలోకి గురుగ్రామ్‌కు తరలించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఉదయం శివరాజ్‌ సింగ్‌ కార్యాలయం ఓ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటూ ఓ సందేశాన్ని ఉంచింది. 

ఒకవేళ స్పీకర్‌ రాజీనామాల్ని ఆమోదిస్తే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 206కు చేరుతుంది. ప్రస్తుతం భాజపాకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌ బలం 92కు తగ్గుతుంది. ఎస్పీకి ఒకరు, బీఎస్పీకి ఇద్దరు, స్వతంత్రులు నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నెల 16న అసెంబ్లీలో బలపరీక్ష ఉండే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని