గ్యాస్‌లీక్‌ ప్రాంతాల్లో కమిటీ అధ్యయనం

విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లో ఉండేందుకు అనువైన పరిస్థితులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలోని స్టైరీన్‌ గ్యాస్‌ ట్యాంక్‌ వద్ద ఉష్ణోగ్రత 80

Published : 11 May 2020 00:44 IST

రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ: విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రభావిత గ్రామాల్లో నివాసానికి అనువైన పరిస్థితులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలోని స్టైరీన్‌ గ్యాస్‌ ట్యాంక్‌ వద్ద ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు తగ్గిందని చెప్పారు. విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకూ ప్రజలు గ్రామాలకు రావద్దని మంత్రి కోరారు. 

బాధితులు కోలుకుంటున్నారు: డీఎంహెచ్‌వో 
గ్యాస్‌ లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులందరూ వేగంగా కోలుకుంటున్నారని డీఎంహెచ్‌వో తిరుమల రావు తెలిపారు. విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో 411 మంది చికిత్స పొందారని.. వారిలో ఇప్పటికే కొందరు బాధితులు కోలుకున్నారన్నారు. కోలుకున్న బాధితులను డిశ్చార్జ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విషవాయువు ప్రభావం ఉన్న గ్రామాల్లో తాజా పరిస్థితి, అధికారుల ఆదేశాలకు అనుగుణంగా బాధితులను ఇళ్లకు పంపుతామని.. అప్పటివరకు వారికి కేజీహెచ్‌లోనే అన్ని సౌకర్యాలు కల్పంచనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఈ గ్యాస్‌లీక్‌ ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తిరుమల రావు వివరించారు.

అదుపులో పరిస్థితి: ఎల్‌జీ పాలిమర్స్‌ జీఎం
ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలోని స్టైరీన్‌ గ్యాస్‌ ట్యాంక్‌ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని కంపెనీ జీఎం మోహన్‌ తెలిపారు. ప్రమాదానికి కారణమైన స్టైరీన్‌ లిక్విడ్‌ గడ్డకట్టి పాలిమర్‌గా మారిందన్నారు. దీని నుంచి ఎలాంటి విషవాయువు బయటకు రావడం లేదని జీఎం స్పష్టం చేశారు. ఇది కాకుండా కంపెనీలో 2, విశాఖ పోర్టులో 2 స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయని మోహన్‌ రావు తెలిపారు. ఈ ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ట్యాంకుల్లో ఉన్న లిక్విడ్‌ స్టైరీన్‌ను వెనక్కి పంపే ఆలోచన చేస్తున్నట్లు జీఎం మోహన్‌ రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని