Published : 16 Jun 2021 10:23 IST

Rajasthan: ప్రభుత్వాన్ని నిలబెట్టాం.. మాకేంటి?

కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని కోరిన రాజస్థాన్‌ బీఎస్పీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

జైపుర్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కేబినెట్‌ను విస్తరిస్తున్నారన్న సంకేతాలు రావడంతో.. ఆశావహులంతా అధిష్ఠానం దృష్టిలో పడేలా ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో చేరారు. గత ఏడాది సచిన్‌ పైలట్‌ వర్గం తిరుగుబాటు చేసినప్పుడు, తమ చేరికల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం నిలబడిందని.. అందుకు తగిన ప్రతిఫలం, గౌరవం ఇప్పుడైనా దక్కాలని కోరారు. ఈ మేరకు మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సీఎం గహ్లోత్‌ నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం పైలట్‌ వర్గంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం చ ర్చలు జరుపుతుండటంపై వారు అభ్యంతరం వ్య క్తం చేశారు. నిరుడు ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టిన వాళ్ల డిమాండ్లు వినాల్సిన అవసరం లేదన్నారు. కేబినెట్‌లో ఖాళీ ఉన్న 9 మంత్రి పదవుల కోసం సుమారు 25 మంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వారితో పాటు, సచిన్‌ వర్గంలోని ఎమ్మెల్యేలు, స్వతంత్రులు ఆశావహులు ఉన్నారు.

సీఎంపై విశ్వాసముందన్న పైలట్‌ వర్గం ఎమ్మెల్యే
మరోవైపు సచిన్‌ పైలట్‌ వర్గంలోని ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరుగా అశోక్‌ గహ్లోత్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి భన్వర్‌లాల్‌ శర్మ.. తమకు సీఎంపై విశ్వాసం ఉందని ప్రకటించారు. ‘‘సచిన్‌ పైలట్‌ను మా నాయకుడిగా పరిగణిస్తాం. కానీ ఆయన కంటే అశోక్‌ గహ్లాత్‌ పెద్ద నేత. పైగా ముఖ్యమంత్రి కూడా. అందుకే మాతో పాటు, సచిన్‌ కూడా గహ్లోత్‌ను నాయకుడిగా పరిగణించాల్సిందే.’’ అని విలేకరులతో చెప్పారు. ఇటీవలి కాలంలో సీఎంను కొనియాడిన పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలలో భన్వర్‌లాల్‌ మూడో వ్యక్తి కావడం విశేషం.

బీఎస్పీ వెలేసిన ఎమ్మెల్యేలు అఖిలేష్‌తో భేటీ
సందిగ్ధావస్థలో మరికొందరు

లఖ్‌నవూ: బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) గతేడాది అక్టోబరులో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఏడుగురు ఎమ్మెల్యేలను సస్పెండు చేయగా.. అందులో అయిదుగురు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌తో మంగళవారం భేటీ అయ్యారు. 15 - 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీతో ఆ ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో బీఎస్పీ ఉపనేత ఉమాశంకర్‌ సింగ్‌ గతంలో ఈ ఎమ్మెల్యేలను ‘చెత్త’ కింద అభివర్ణించారు. తాజాగా అఖిలేష్‌తో జరిగిన భేటీపై ఆ అయిదుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన ముంగ్రా బాద్‌షాపుర్‌ శాసనసభ్యురాలు సుష్మా పటేల్‌ మాట్లాడుతూ త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల గురించి అఖిలేష్‌తో చర్చించినట్టు తెలిపారు. భవిష్యత్‌ ప్రణాళిక ఏమిటని అడగ్గా.. నా మటుకు నేను ఎస్పీలో చేరడానికి నిర్ణయించుకున్నా అని ఆమె బదులిచ్చారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ప్రస్తుతం బీఎస్పీ బలం 18. హండియా నియోజకవర్గ శాసనసభ్యుడు హకీంలాల్‌ బింద్‌ మాట్లాడుతూ.. తనతోపాటు చౌధరి అస్లాం అలి, ముజ్తబా సిద్దీఖి, హర్‌గోవింద్‌ భార్గవ్, .మహమ్మద్‌ అస్లాం రైనీ, సుష్మా పటేల్‌లు అఖిలేష్‌ను కలిసినట్టు తెలిపారు. ఈ బృందంలో తాను లేనంటూ ఆ తర్వాత హర్‌గోవింద్‌ భార్గవ్‌ ఖండించారు. భింగా ఎమ్మెల్యే అస్లాం రైనీ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తాము 11 మంది ఉన్నామని, మరొకరు చేరితే ప్రత్యేకవర్గంగా కొనసాగుతామన్నారు. మాజీ స్పీకర్‌ సుఖ్‌దేవ్‌ రాజ్భర్‌ తమతో కలిసివచ్చే అవకాశముందన్నారు. ముజ్తబా సిద్దీఖీ మాట్లాడుతూ.. మాయావతి తమపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తివేస్తారనే ఆశతో ఉన్నట్టు చెప్పారు.

 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని