BJP: పూర్వాంచల్‌లో పాగా వేసేద్దాం..ఎన్నికల నేపథ్యంలో భాజపా ప్రత్యేక దృష్టి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతమైన పూర్వాంచల్‌పై భాజపా నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

Updated : 30 Dec 2021 10:19 IST

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతమైన పూర్వాంచల్‌పై భాజపా నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ప్రాంతంలోనే వారణాసి, గోరఖ్‌పుర్‌ స్థానాలు ఉండడం, వాటి ప్రభావం ఇతర నియోజకవర్గాలపై పడనుండడమే ఇందుకు కారణం. స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇక్కడ అమలు చేయాల్సిన ఎన్నికల వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఆయన వారణాసిలో పర్యÆటించి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ ఓట్లను నిలబెట్టుకోవడంతో పాటు, ఎస్పీ, బీఎస్పీ ఓటు బ్యాంకును చీల్చడంపై దిశానిర్దేశం చేశారు. దళిత, వెనుకబడినవర్గాల కార్యకర్తలను క్రియాశీలకంగా మార్చడం ద్వారా ఎస్సీ, బీసీల ఓటు బ్యాంకులను దెబ్బ తీయొచ్చని ఆయన భావిస్తున్నారు. బీఎస్పీ బలహీనపడినందున దాని మూలాధారమైన ఎస్సీలను ఆకర్షించడంపై సూచనలు ఇచ్చారు. వారణాసి, గోరఖ్‌పూర్‌ ప్రాంతాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించారు. బలహీనతలను గుర్తించి, వాటిని సరిదిద్దడంపై దృష్టి సారించారు. కుల సమీకరణలపై జాగ్రత్తలు తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.

నేడు అమిత్‌ షా రాక

భాజపా నిర్వహిస్తున్న జనవిశ్వాస్‌ యాత్ర జనవరి 2న లఖ్‌నవూ చేరుకుంటుంది. ఆ రోజు నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుగుతాయి. 3న లఖ్‌నవూలో బహిరంగసభ నిర్వహించి యాత్రను ముగిస్తారు. పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఇందులో పాల్గొంటారు. జనవరి 5న జరగనున్న మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమానికి ప్రధాన మంత్రి మోదీ హాజరవుతారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు అమిత్‌ షా గురువారం లఖ్‌నవూ రానున్నారు.

ఇంట్లోని అందరి ఓట్లూ ఒకే బూత్‌లో ఉండాలి ఎన్నికల సంఘానికి భాజపా వినతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల సన్నాహాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలోని బృందం పరిశీలన జరుపుతోంది. మంగళవారం లఖ్‌నవూ చేరుకున్న ఈ బృందం బుధవారం వివిధ పార్టీల నేతలతో భేటీ అయింది. ప్రతి పోలింగ్‌బూత్‌ వద్ద మహిళా భద్రతా సిబ్బందిని నియమించాలని, ఒక కుటుంబంలోని సభ్యులందరి ఓట్లు ఒకే బూత్‌లో ఉండేలా చూడాలని, జనసాంద్రత ఎక్కువగా ఉన్న పోలింగ్‌ బూత్‌ల వద్ద కరోనాకు మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని భాజపా ప్రతినిధులు కోరారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించాలని అన్నారు. 80 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు పోలింగ్‌బూత్‌ల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని సమాజ్‌వాదీ నేతలు కోరారు. ఓటర్ల జాబితాను పోలింగ్‌బూత్‌ల వద్ద అందుబాటులో ఉంచాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి అవనీష్‌ కుమార్‌ అవస్థిపై ఫిర్యాదులు చేశారు. ఆయనను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని, ఎన్నికలను సకాలంలో సజావుగా నిర్వహించాలని బీఎస్పీ నాయకులు కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని