చిన్న రాష్ట్రాలు.. భారీ అంచనాలు

మామూలుగానైతే త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు అంతగా ప్రాచుర్యం పొందవు. వచ్చేనెలలో జరిగే ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలపై ఈసారి యావద్దేశం దృష్టిసారిస్తోంది.

Published : 25 Jan 2023 03:25 IST

ఈశాన్య సమరంతో ఎన్నికల కాలానికి శ్రీకారం
అందుకే దేశవ్యాప్త ఆసక్తి

మామూలుగానైతే త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు అంతగా ప్రాచుర్యం పొందవు. వచ్చేనెలలో జరిగే ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీలపై ఈసారి యావద్దేశం దృష్టిసారిస్తోంది. కారణం- దేశంలో రాబోయే ఏడాదిన్నర పాటు సాగే ఎన్నికల కోలాహలానికి ఈ ఈశాన్య భారతమే శ్రీకారం చుట్టబోతోంది. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీలకు ఫిబ్రవరిలో జరిగే పోలింగ్‌తో దేశంలో ఎన్నికల హడావుడి ఆరంభమవుతుంది. ఇది మరో ఆరు రాష్ట్రాల (కర్ణాటక, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ) అసెంబ్లీల మీదుగా సాగి, 2024 లోక్‌సభ ఎన్నికల వరకు వెళ్తుంది. తలో 60 సీట్లతో కూడిన మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీలు చిన్నవే అయినా వీటి ఫలితాలపై మాత్రం భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అన్నింటా కమలంపైనే కళ్లు

మూడు రాష్ట్రాల్లోనూ అందరి కళ్లు కమలనాథుల పార్టీపైనే ఉన్నాయి. కారణం- మూడింటా ప్రస్తుతం భాజపా ఏదో ఒకవిధంగా అధికార పక్షంలో ఉండటమే. త్రిపురలో నేరుగా భాజపా సర్కారు అధికారంలో ఉంది. నాగాలాండ్‌, మేఘాలయల్లో ఇతర అధికార పార్టీలతో కలసి నడుస్తోంది. ఒకప్పుడు ఈశాన్యంలో ఉనికిలేని భాజపా క్రమంగా ఈ ప్రాంతంపై పట్టు సంపాదించింది. నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు స్థానిక పార్టీలతో కలసి ‘ఈశాన్య ప్రజాతంత్ర కూటమి’ (ఎన్‌ఈడీయే)ను భాజపా ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయి ఎన్డీయేలాంటిదే ఇది. అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరాక, అంటే 2015 నుంచి ఈశాన్యంలో భాజపా విస్తరణ వేగం పుంజుకుంది. కేంద్రంలో 2014 నుంచీ భాజపా సర్కారు కొనసాగుతుండటం కూడా ఆ పార్టీకి కలసి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారితో కలసి పనిచేస్తుంటాయి.

త్రిపురలో తలనొప్పులు

త్రిపురలో 25 సంవత్సరాల అప్రతిహత కమ్యూనిస్టు కంచుకోటను కమలనాథులు గత ఎన్నికల్లో (2018) బద్దలు కొట్టారు. ఈశాన్యంలో, అదీ త్రిపురలాంటి చోట భాజపా విజయం అప్పుడో భారీ సంచలనం. ఈ ఐదేళ్లలో రాష్ట్రం ఇద్దరు భాజపా ముఖ్యమంత్రులను చూసింది. త్రిపురలో కమలం పార్టీ తొలి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన విప్లవ్‌దేవ్‌ను పనితీరు బాగోలేదనే కారణంతో నిరుడు పక్కనబెట్టారు. డాక్టర్‌ మానిక్‌ సాహాకు పగ్గాలు అప్పగించినా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆగటం లేదు. దీనికితోడు గత ఎన్నికల్లో భాజపా మిత్రపక్షమైన ఆదివాసీ పార్టీ ‘ఇండీజినియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర’ (ఐపీఎఫ్‌టీ)తో బంధం దెబ్బతింది. కాంగ్రెస్‌ మాజీ నేత ప్రద్యుత్‌ మాణిక్య... తిప్రమోథా పార్టీని స్థాపించి ఆదివాసీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక తిప్రలాండ్‌ రాష్ట్రం కోసం ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన హిందూ శరణార్థులతో ఆదివాసీలు మైనార్టీలుగా మారారన్నది వీరి వాదన. పలువురు భాజపా నేతలు, ఎమ్మెల్యేలు ఈ తిప్రమోథాలో చేరారు. 2021లో త్రిపుర ప్రాంత స్వయంపాలిత జిల్లా కౌన్సిల్‌ ఎన్నికల్లో ఈ తిప్రమోథా ఘన విజయం సాధించటం గమనార్హం. భాజపాతో అవగాహనకు తిప్రా సిద్ధంగానే ఉంది. లేనిపక్షంలో వీరంతా ఐపీఎఫ్‌టీతో కలిసే అవకాశాలున్నాయి. త్రిపురలో 20 ఆదివాసీ సీట్లున్నాయి. భాజపాను దెబ్బతీయటానికి కాంగ్రెస్‌, వామపక్షాలు ఒక్కటయ్యాయి. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ తృణమూల్‌ను ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించాలని చూస్తున్నారు. ఈ మేరకు ఆమె ఆ రాష్ట్రంలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు. త్రిపురలో ఎన్నికలు ఫిబ్రవరి 16న జరుగుతాయి.

మేఘాలయలో ఎవరికి వారే

మేఘాలయలో 2018 ఎన్నికల్లో రెండే సీట్లు గెల్చినా భాజపా అధికారదర్పాన్ని ప్రదర్శించింది. కారణం- ఎవ్వరికీ స్పష్టమైన మెజార్టీ రాని వేళ కన్రాడ్‌ సంగ్మా సారథ్యంలోని నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)కి భాజపా మద్దతిచ్చింది. ఇటీవలే ఈ రెండుపార్టీల మధ్య వాగ్యుద్ధం జరిగి సంబంధాలు తెగిపోయాయి. ఈసారి తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు సంగ్మా ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే సంకీర్ణ ప్రభుత్వానికి ఈసారి తామే సారథ్యం వహించాలన్నది భాజపా యోచన. ఇందుకోసం ఎన్‌ఈడీఏ కన్వీనర్‌, అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. మొత్తానికి మేఘాలయ రాజకీయ ముఖచిత్రం ఫిబ్రవరి 27న జరిగే ఎన్నికల తర్వాతి పొత్తులపైనే ఆధారపడేలా ఉంది.

నాగాలో పొత్తులు ఖరారు

త్రిపుర, మేఘాలయల్లో ఇబ్బందులు పడుతున్న భాజపా- నాగాలాండ్‌లో మాత్రం ఇప్పటికే పొత్తులు ఖరారు చేసుకుంది. అధికార నేషనలిస్ట్‌ డెమొక్రాటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ)తో కమలనాథుల పొత్తు కొనసాగుతుంది. 20 సీట్లలో భాజపా, 40 సీట్లలో ఎన్‌డీపీపీ పోటీ చేయబోతున్నాయి. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్‌ అస్థిత్వ పోరాటంలో ఉంది. 16 జిల్లాలతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ కొన్ని ఆదివాసీ తెగలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వటం గమనార్హం.

ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని