కేంద్ర బడ్జెట్‌పై భాజపా దేశవ్యాప్త ప్రచారం

పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లోని ప్రజానుకూల అంశాలను దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా నిర్ణయించింది.

Published : 01 Feb 2023 04:27 IST

12 రోజుల పాటు కార్యక్రమాలు

దిల్లీ: పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లోని ప్రజానుకూల అంశాలను దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా నిర్ణయించింది. దీని కోసం బుధవారం నుంచి 12 రోజుల పాటు విస్తృత స్థాయిలో కార్యక్రమాలను చేపట్టనుంది. దీనికోసం భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా 9 మంది సభ్యులతో కార్యదళాన్ని నియమించారు. పార్టీ సీనియర్‌ నేత సుశీల్‌ మోదీ సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ బడ్జెట్‌పై చర్చలు, సెమినార్లు, మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. తొలుత భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విలేకరుల భేటీల్లో మాట్లాడతారు. పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షులు వీటిని నిర్వహిస్తారు. 50 ప్రధాన నగరాల్లో కేంద్ర మంత్రులు మీడియా భేటీలు నిర్వహించి బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశాలను వివరిస్తారు.

‘తొలి విడత సమావేశాలు 10కల్లా ముగించండి’

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన ప్రకారం...తొలి విడత భేటీలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు ఉంటాయి. అయితే, 13న కాకుండా 10వ తేదీనే ముగించాలని విపక్ష పార్టీల నేతలు విజ్ఞప్తి చేశారని పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం వెల్లడించారు. లోక్‌సభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) భేటీలో ఈ ప్రతిపాదన చేయగా పరిశీలిస్తానని స్పీకర్‌ ఓం బిర్లా హామీ ఇచ్చారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు