సీఎం జగన్‌ నైతికంగా పతనమయ్యారు

సీఎం జగన్‌రెడ్డి నైతికంగా పతనమయ్యారని, చరిత్రహీనుడిగా మిగిలిపోతారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.

Updated : 05 Mar 2023 07:13 IST

మాట్లాడితే కేసులు, దాడులతో అరాచకాలు సృష్టిస్తున్నారు
అధికారంలోకి వస్తే న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు
తెదేపా లీగల్‌సెల్‌ రాష్ట్రస్థాయి సమావేశంలో చంద్రబాబు

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌రెడ్డి నైతికంగా పతనమయ్యారని, చరిత్రహీనుడిగా మిగిలిపోతారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్ల తర్వాత కూడా జగన్‌లాంటి దుర్మార్గుడు సీఎంగా ఉంటే ప్రజలకు భవిష్యత్తు ఉండదన్నారు. మంగళగిరిలో శనివారం తెదేపా లీగల్‌సెల్‌ రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వైకాపా అరాచక పాలన వల్ల వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి. అనేక ఘటనల్లో తెదేపా వాళ్లే బాధితులుగా ఉన్నా మళ్లీ వారిపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి హింసిస్తున్నారు. ఇంత నీచమైన రాజకీయం ఎప్పుడూ చూడలేదు. వాళ్లు ఎన్ని చేసినా అంతిమ విజయం తెదేపాదే. సీఐడీ విభాగం మాజీ అధిపతి సునీల్‌కుమార్‌ ఎంత దారుణంగా ప్రవర్తించారో చూశాం. నాపై రాజశేఖర్‌రెడ్డి అనేక కేసులు వేశారు. నేను ఏ తప్పూ చేయనందున ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ ఇప్పుడు జగన్‌... తప్పులు లేకుండానే కేసులు పెడుతున్నారు. ప్రజలను బెదిరించి, ఆస్తులు రాయించుకుంటున్నారు. ఒక్క విశాఖలోనే రూ.40 వేల కోట్ల విలువైన ఆస్తులు రాయించుకున్నారు’ అని విమర్శించారు.

నిజం మాట్లాడితే దాడులు..

‘ఇప్పుడు ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలియడం లేదు. వచ్చే ఎన్నికల్లో నామినేషన్‌లో వెల్లడించేందుకు నాపై ఎన్ని కేసులున్నాయి? అని డీజీపీకి లేఖ రాసి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైకాపా అక్రమాల్ని బయటపెట్టి ఎన్నికలు సజావుగా జరిగేలా న్యాయవాదులు చూడాలి. తటస్థులు, చివరికి వైకాపా నేతలు నిజం మాట్లాడినా దాడులుచేసి, కేసులు పెడుతున్నారు. లోకేశ్‌ పాదయాత్రలో 12 కేసులు నమోదైతే 9 కేసుల్ని పోలీసులే పెట్టారు. పర్యటనలకు వెళ్తుంటే జీవో-1 తెచ్చి అడ్డంకులు సృష్టిస్తున్నారు. అనునిత్యం రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు. తెదేపా కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నారు. దీనికి బలమైన పార్టీ లీగల్‌సెల్‌ సభ్యులే కారణం’ అని చంద్రబాబు అన్నారు.

ఇళ్ల స్థలాలు ఇస్తాం

‘తెదేపా అధికారంలోకి వస్తే న్యాయవాదులుగా పని చేస్తున్న ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి, తక్కువ     వడ్డీకి రుణాలు అందిస్తాం. పేద న్యాయవాదుల సంక్షేమానికి రూ.150 కోట్లతో కార్పస్‌ఫండ్‌ ఏర్పాటు చేస్తాం. న్యాయవాదుల రక్షణకు చట్టాన్ని తీసుకొస్తాం’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సమావేశంలో తెదేపా న్యాయవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే న్యాయవాదులదే ముఖ్యమైన పాత్ర అన్నారు. రాబోయే ఏడాది కాలం మరింత కీలకమని, స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుని ఓటర్ల జాబితా నుంచి కౌంటింగ్‌ వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు సమక్షంలో హైకోర్టు న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు తెదేపాలో చేరారు.


పోలీసులా? వైకాపా కార్యకర్తలా?: బాధితుల ఆవేదన

వైకాపా నాయకులు నిందితులుగా ఉన్న పలు హత్యకేసుల్లో పోలీసులు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఛార్జిషీటు దాఖలు చేయడం లేదని బాధితులు వాపోయారు. దీంతో నిందితులు బరితెగించి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే...


వాహనంతో ఢీకొట్టి చంపారు
- వడ్డు ప్రతాప్‌రెడ్డి కుమార్తె ప్రశాంతి, పెసరవాయి, నంద్యాల జిల్లా

గ్రామంలో తెదేపా తరఫున క్రియాశీలకంగా ఉన్నారని 2021 జూన్‌లో మా నాన్న వడ్డు ప్రతాప్‌రెడ్డి, పెద్దనాన్న వడ్డు నాగేశ్వర్‌రెడ్డిని స్థానిక వైకాపా నాయకులు వాహనంతో ఢీకొట్టి అతి కిరాతకంగా నరికి చంపారు. ఇప్పటికీ ఈ కేసులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయలేదు. ఇప్పటికీ నిందితుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి.


రెండో బిడ్డనూ చంపేస్తానని అనంతబాబు హెచ్చరించారు
- నూకారత్నం, మావిడాడ, కాకినాడ

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవర్‌గా నా బిడ్డ సుబ్రహ్మణ్యం చేత 6 ఏళ్లు పని చేయించుకున్నారు.  ఆయన దగ్గర పనిమానేసిన 3 నెలలకు అనంతబాబు ఫోన్‌ చేసి... తన దగ్గర డబ్బు తీసుకున్నారని బెదిరించడం మొదలుపెట్టారు. ఓరోజు అర్ధరాత్రి సుబ్రహ్మణ్యానికి యాక్సిడెంట్‌ అయిందని ఫోన్‌ చేసి చెప్పారు. డివైడర్‌ను ఢీకొట్టి చనిపోయాడని కథ అల్లేందుకు ప్రయత్నించారు. కారులో మృతదేహాన్ని తీసుకొచ్చి రూ.2 లక్షలు ఇస్తా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోండన్నారు. ప్రమాదం జరిగిందంటున్నారు... శరీరమంతా ఇసుక ఉందేమిటని అడిగితే బెదిరింపులకు దిగారు. ఇంకో కుమారుడు ఉన్నాడు జాగ్రత్త అని హెచ్చరించారు. అనంతబాబు బెయిల్‌పై వచ్చి బయట తిరుగుతున్నారు. మా రెండో కుమారుడు బయటకు వెళితే ఏం చేస్తారోనని భయపడుతున్నాం.


గొంతుమీద కత్తిపెట్టి జైజగన్‌ అనాలన్నారు
- తోట వీరాంజనేయులు, మాచర్ల

మాచర్ల నియోజకవర్గం అరాచకాలు, దాడులు, హత్యలకు అడ్డాగా మారింది. వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి అరాచకాలకు అంతేలేదు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డికి అండగా ఉన్నారనే కారణంతోనే వైకాపా నాయకుడు... నా కళ్ల ముందే మా నాన్న తోట చంద్రయ్యను హత్యచేశాడు. వైకాపా నాయకుడు మా నాన్న గొంతు మీద కత్తి పెట్టి జై జగన్‌ అంటే విడిచిపెడతామన్నాడు. కానీ మా నాన్న జై చంద్రబాబు, జై తెలుగు దేశం అని అన్నారు. దీంతో నాన్నను చంపేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఛార్జిషీటు దాఖలు చేయలేదు.


అరాచకాలను ప్రశ్నిస్తే.. బూట్లు నాకిస్తామన్నారు?
- మునిరాజమ్మ, తొట్టంబేడు, తిరుపతి జిల్లా

‘యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు నా బాధలు, కష్టాలు, అధికారులు లంచాల కోసం ప్రజల్ని పీక్కు తింటున్న వైనాన్ని వివరించా. అంతే కొందరు వైకాపా నాయకుల్ని ఎమ్మెల్యే నా ఇంటి మీదికి పంపించారు. రోడ్డు పక్కన ఉన్న నా టిఫిన్‌ బండిని వారు ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన నా భర్తను చావగొట్టారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డినే ప్రశ్నిస్తావా నీ దుస్తులూడదీస్తాం. ఎవడొస్తాడో చూస్తామని ఓ వైకాపా నాయకుడు నన్ను బెదిరించాడు. మధుసూదన్‌రెడ్డి కాళ్లపై పడాలని, ఆయన బూట్లు నాకాలని ఇష్టారీతిన మాట్లాడి నన్ను అవమానించారు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారూ సరిగా స్పందించలేదు. వైకాపా నాయకులు తిరిగి నామీదే తప్పుడు కేసులు పెట్టారు. రజక సామాజిక వర్గానికి చెందిన నన్ను కులం పేరుతో దూషించారు’ అని తిరుపతి జిల్లా తొట్టంబేడుకు చెందిన మునిరాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మునిరాజమ్మ ఆవేదన విన్న చంద్రబాబు ఆమెకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వైకాపా నేతల బెదిరింపులకు భయపడొద్దని.. పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


చంద్రబాబుతో ఫొటో.. నాన్న కోరిక
-  నాగప్రత్యూష, న్యాయవాది, తుని నియోజకవర్గం

‘నేను పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా. తెదేపా ప్రభుత్వమిచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంటుతోనే చదువు పూర్తి చేయగలిగా. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా కుటుంబంలో వచ్చే పింఛను తీసేందుకు అక్కడి నేతలు ప్రయత్నించారు. దీనికి అడ్డుకట్ట వేశా. ఆ ధైర్యం నాకు తెదేపానే ఇచ్చింది. మా నాన్నకు చంద్రబాబు అంటే అభిమానం. ఆయన ఇటీవల క్యాన్సర్‌ బారినపడ్డారు. చంద్రబాబుతో కలిసి ఫొటో తీసుకుని తనకు పంపాలని కోరారు’ అని ప్రత్యూష కన్నీటిపర్యంతమయ్యారు. స్పందించిన చంద్రబాబు... ఆమెను వేదికపైకి పిలిచి తనతో ఫొటో దిగారు. కుటుంబ వివరాలను ఆరా తీశారు. ఏ సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు