పట్టభద్రుల స్థానాల్లో రెండు తెదేపాకే

శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ విజయం సాధించారు.

Updated : 18 Mar 2023 06:41 IST

ఉత్తరాంధ్రలో చిరంజీవిరావు.. తూర్పు రాయలసీమలో శ్రీకాంత్‌ గెలుపు
పశ్చిమ రాయలసీమ స్థానంలో ఇరుపార్టీల హోరాహోరీ

ఈనాడు-విశాఖపట్నం, ఈనాడు-తిరుపతి, ఈనాడు డిజిటల్‌-చిత్తూరు, న్యూస్‌టుడే-వన్‌టౌన్‌, అనంత జిల్లా సచివాలయం: శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు భారీ విజయం సాధించారు. తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ గెలిచారు. పశ్చిమ రాయలసీమలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.

ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90% తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు.. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో సాధించారు. ఇక్కడ విజయానికి 94,509 కోటా ఓట్లు అవసరం. మొదటి ప్రాధాన్యంలో చిరంజీవిరావుకు 82,958 ఓట్లు వచ్చాయి. విజయానికి ఇంకా 11,551 ఓట్లు అవసరమయ్యాయి. పోటీలో నిలిచిన 33మంది స్వతంత్రులు, భాజపా అభ్యర్థి మాధవ్‌లకు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ తెదేపా అభ్యర్థి చిరంజీవిరావుకే మెజారిటీ ఓట్లు దక్కాయి. మూడో స్థానంలో నిలిచిన పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు దక్కిన ఓట్లలో దాదాపు 18,000 లెక్కించే సమయానికే విజయానికి అవసరమైన కోటా ఓట్లు చిరంజీవిరావుకు దక్కడంతో  ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం ఖాయమైంది. అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. తెదేపా అభ్యర్థి చిరంజీవిరావుకు కోటా ఓట్లు 94,509 వచ్చే సమయానికి వైకాపా అభ్యర్థి సుధాకర్‌కు 59,644 ఓట్లు వచ్చాయి. గురువారం సాయంత్రం 5గంటల నుంచి తొలి ప్రాధాన్య ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభం కాగా తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు.. వైకాపా అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. మొదటి రౌండ్‌ నుంచి తెదేపా అభ్యర్థి ఆధిక్యం చూపించారు. పోలైన 2,01,335 ఓట్లను 8 రౌండ్లలో లెక్కించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో తెదేపా అభ్యర్థికి 82,958 ఓట్లు (41.20%), వైకాపా అభ్యర్థికి 55,749 (27.25%) ఓట్లు దక్కాయి. ఇద్దరి మధ్య 13.95% వ్యత్యాసం కనిపించింది. సిటింగ్‌ ఎమ్మెల్సీ, భాజపా అభ్యర్థి మాధవ్‌ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించారు. చిత్తూరు ఎస్వీసెట్‌ కళాశాలలో రెండోరోజైన శుక్రవారం ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఏడు రౌండ్లలో 2,69,339 ఓట్లు పోలవ్వగా ఇందులో 20,979 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2,48,360 ఓట్లు లెక్కించగా రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి తెదేపా అభ్యర్థి 1,12,686 ఓట్లు సాధించారు. వైకాపా అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఆయన విజయాన్ని రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

చెల్లని ఓట్లు..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,979 చెల్లని ఓట్లు పోలయ్యాయి. తూర్పు రాయలసీమ పరిధిలో అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని తొలి నుంచి విపక్షాలు విమర్శిస్తున్నాయి. భారీగా ఓట్లు చెల్లకపోవడం విపక్షాల విమర్శలకు బలాన్నిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పశ్చిమ రాయలసీమలో నువ్వా... నేనా

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ప్రతి రౌండులోనూ తెదేపా, వైకాపా బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. అనంతపురం జేఎన్‌టీయూలో గురువారం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 8 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 2,45,576 ఓట్లు పోలవ్వగా... 1,92,018 ఓట్లను లెక్కించారు. ఇందులో 15,104 చెల్లనివిగా గుర్తించారు. మిగతా 1,76,914 ఓట్లలో వైకాపా మద్దతిచ్చిన వెన్నపూస రవీంద్రారెడ్డి 74,678, తెదేపా బలపరిచిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 73,229, పీడీఎఫ్‌ నేత పోతుల నాగరాజు 15,254, భాజపా బలపరిచిన రాఘవేంద్రకు 5,933 ఓట్లు వచ్చాయి. ఈ స్థానంలో 49 మంది పోటీపడ్డారు.

రెండో ప్రాధాన్య ఓటే కీలకం

ఇప్పటిదాకా అభ్యర్థులకు లభించిన ఓట్ల సరళిని పరిశీలిస్తే ఎవ్వరికీ కటాఫ్‌ ఓట్లు లభించే పరిస్థితి కనపడట్లేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓటే కీలకంగా మారనుంది. ప్రస్తుతం రవీంద్రారెడ్డి 1,449 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. ఇంకా మూడురౌండ్లు లెక్కించాలి. తెదేపా, వైకాపా అభ్యర్థులకు దాదాపు సమానంగా ఓట్లు వస్తున్నాయి. ఇప్పటివరకు లెక్కించినవాటిలో రవీంద్రారెడ్డికి 42.21%, రామగోపాల్‌రెడ్డికి 41.39% వచ్చాయి. తేడా 0.82 శాతమే. మొత్తం 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు శనివారం తెల్లవారుజామున పూర్తయ్యే అవకాశం ఉంటుంది. తర్వాతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు శ్రీకారం చుడతారు. తుది ఫలితం శనివారం సాయంత్రంలోపు రావచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని