‘షాపూర్‌జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’

రాజధాని ప్రాంతంలో రూ.7 వేల కోట్ల విలువైన పనులు చేసిన షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి నుంచి తెదేపా అధినేత చంద్రబాబు రూ.143 కోట్లు వసూలు చేశారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 25 Mar 2023 09:21 IST

అసెంబ్లీలో సీఎం జగన్‌ ఆరోపణ

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతంలో రూ.7 వేల కోట్ల విలువైన పనులు చేసిన షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి నుంచి తెదేపా అధినేత చంద్రబాబు రూ.143 కోట్లు వసూలు చేశారని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. 5 శాతం కమీషన్‌ కింద ఈ మొత్తం వసూలు చేశారని పేర్కొన్నారు. షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌, చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌లపై ఆదాయపు పన్ను శాఖ చేసిన సోదాల్లో ఈ విషయం వెల్లడైందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ చంద్రబాబుకు కూడా తాజాగా నోటీసులు జారీ చేసిందని వివరించారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమరనాథ్‌ ఈ అంశంపై శుక్రవారం శాసనసభలో ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఈ అంశంపై మాట్లాడారు. ఎల్‌అండ్‌టీ కంపెనీ నుంచి కూడా డబ్బులు రప్పించే బాధ్యతనూ చంద్రబాబు.. మనోజ్‌ వాసుదేవ్‌కే అప్పగించారని ఆరోపించారు.

‘2019 జనవరి, ఫిబ్రవరి నెలల్లో చంద్రబాబు మనోజ్‌ వాసుదేవ్‌ను పిలిపించి మాట్లాడి.. తన పీఏ శ్రీనివాస్‌ను కలవాలని సూచించారు. వారి కంపెనీలకు బోగస్‌ సబ్‌కాంట్రాక్టుల కింద డబ్బులివ్వాలని, వారు తమకు ఆ డబ్బులిస్తారని చెల్లిస్తారని చెప్పారు. చంద్రబాబుకు దుబాయ్‌లో దినార్‌ల రూపంలో రూ.15.14 కోట్లు ఇచ్చారని జగన్‌ ఆరోపించారు. షాపూర్‌జీ పల్లోంజి కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌పై 2019 నవంబరులో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించిందన్నారు. ఆ సోదాల్లో లభించిన సమాచారం ఆధారంగా 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ఇంట్లో సోదాలు చేపట్టారని తెలిపారు. అందులో తేలిన అంశాల ఆధారంగానే ఆదాయపు పన్ను శాఖ అప్రైజల్‌ రిపోర్టు సిద్ధం చేసి ఈ వివరాలు పొందుపరిచి, చంద్రబాబుకు నోటీసులిచ్చిందని ఆరోపించారు.


అప్పుల వృద్ధిరేటు గతం కంటే తక్కువ

‘ఇంతకు ముందున్న రాష్ట్ర బడ్జెట్టే ఇప్పుడూ ఉంది. మా ప్రభుత్వంలో అప్పుల వృద్ధిరేటు కూడా గతం కంటే తక్కువే. అయినా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా నేరుగా రూ.2 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. తెదేపా హయాంలో ఇలా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు వెళ్లలేదు? ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రజలు ఆలోచించాలి’ అని జగన్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని