సిట్‌పై విశ్వాసం లేదు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్‌ విచారణ నోటీసులు తనకు అందలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సిట్‌కు రెండు పేజీల లేఖను గురువారం రాత్రి పంపారు.

Published : 25 Mar 2023 03:58 IST

నమ్మకం ఉన్న సంస్థలకే సమాచారం ఇస్తా
సిట్‌కు బండి సంజయ్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్‌ విచారణ నోటీసులు తనకు అందలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సిట్‌కు రెండు పేజీల లేఖను గురువారం రాత్రి పంపారు. సిట్‌పై తనకు విశ్వాసంలేదని తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వదలచుకోలేదని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తే సమాచారం ఇస్తామని స్పష్టంచేశారు. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి...‘చదువుకున్న లక్షలమంది నిరుద్యోగుల ఆకాంక్షలను ప్రశ్నపత్రాల లీకేజీ సమాధి చేసింది. ఈ నేపథ్యంలో సిట్‌ నుంచి నాకు ఎలాంటి నోటీసు అందలేదు. అందులోని అంశాలు కూడా నాకు తెలియవు. 24వ తేదీన సిట్‌ ముందు హాజరుకావాలని నోటీసు ఇచ్చినట్లు నాకు వార్తాకథనాల ద్వారా తెలిసింది. పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున విచారణకు మరో తేదీని సూచించాలి. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి నేను చేసిన ప్రకటనలపై ఆధారాలను ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న సిట్‌ విచారణపై విశ్వాసంలేదని ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి చెబుతూనే ఉన్నా. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి ద్వారా ప్రశ్నపత్రాల లీకేజీపై విచారణ జరగాలి. దీనికి సంబంధించి సమాచారం సిట్‌కు ఇచ్చే ప్రశ్నే తలెత్తదు, నాకు విశ్వాసం ఉన్న పరిశోధన సంస్థలకే సమాచారం ఇచ్చే హక్కు నాకుంది’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

నేడు భాజపా నిరుద్యోగుల మహాధర్నా

‘మా నౌకరీలు మాగ్గావాలే’ నినాదంతో హైదరాబాద్‌లో ఇందిరాపార్క్‌ వద్ద దీక్ష చేయనున్నట్లు భాజపా ప్రకటించింది. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ధర్నా జరుగుతుందని తెలిపారు. ఈ మహాధర్నాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ కార్యవర్గసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని వివరించారు.

షరతులతో అనుమతించండి: హైకోర్టు

ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌లో నిరుద్యోగుల సమస్యలపై శనివారం భాజపా నిర్వహించదలచిన మహాధర్నాకు షరతులతో అనుమతించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనరాదని, అందులో పాల్గొనే జాతీయ, రాష్ట్ర నాయకుల వివరాలను అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే ప్రసంగాలుచేయరాదంది. మహాధర్నాకు పోలీసులు అనుమతి మంజూరు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ అత్యవసరంగా విచారణ చేపట్టాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలుచేశారు. జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం భోజన విరామ సమయంలో విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని