మోదీ నియంతృత్వానికి ఇది పరాకాష్ఠ

రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ఠ అని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

Published : 25 Mar 2023 03:58 IST

రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం ప్రధాని మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ఠ అని భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా.. అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యల కోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయమని ఆయన దుయ్యబట్టారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటు కాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోంది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య ఉండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం భాజపా ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. భాజపా దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి’’ అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని