ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ సహకరించాలి

ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో భాజపాతో పోరాడటానికి జాతీయ పార్టీలు మద్దతివ్వాలని.. కాంగ్రెస్‌ను ఉద్దేశించి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

Published : 27 Mar 2023 03:42 IST

అఖిలేశ్‌ యాదవ్‌ సూచన

లఖ్‌నవూ: ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో భాజపాతో పోరాడటానికి జాతీయ పార్టీలు మద్దతివ్వాలని.. కాంగ్రెస్‌ను ఉద్దేశించి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై అడిగిన ప్రశ్నకు ఆదివారం ఆయన సమాధానమిస్తూ.. ఆ పార్టీ సత్యాగ్రహం నిర్వహించడంపై అభినందిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఉద్యమానికి మద్దతిస్తారా? అన్న ప్రశ్నకు.. రాహుల్‌ గాంధీపట్ల ఎస్పీ సానుభూతితో ఉందా? అనేది ఇక్కడ విషయం కాదని, దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనగలుగుతాయా? లేదా? అనేదే ముఖ్యమని పేర్కొన్నారు. తాము ఏ పార్టీకీ సానుభూతి చూపబోమని స్పష్టం చేశారు. ‘భాజపాతో రాష్ట్ర స్థాయిలో పోరాడుతున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలి. కేంద్రంలోని ప్రభుత్వమే ప్రాంతీయ పార్టీలకు హాని కలిగించింది. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్నుశాఖలు ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకున్నాయి. ములాయంసింగ్‌, లాలుప్రసాద్‌, జయలలిత, స్టాలిన్‌, కేసీఆర్‌, దిల్లీలో ఆప్‌ పార్టీ నేతలందరూ కేంద్రంలోని పార్టీలకు లక్ష్యంగా మారారు’ అని అఖిలేశ్‌ వ్యాఖ్యానించారు. ‘కూటమి ఏర్పాటుచేయడం తమ బాధ్యత కాదని, కూటమికి సహకారం అందించడమే తమ విధి’ అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు