కాంగ్రెస్‌ వైపే కర్ణాటక ముస్లింలు

కర్ణాటకలో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌కే సలాం అన్నారు. శాసనసభ ఎన్నికల్లో 9 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించగా వారందరూ కాంగ్రెస్‌వారే.

Updated : 15 May 2023 04:10 IST

టికెట్లు పొందిన 15 మందిలో తొమ్మండుగురు గెలుపు
రిజర్వుడ్‌ స్థానాల్లో బోణీ కాని భాజపా

దిల్లీ: కర్ణాటకలో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌కే సలాం అన్నారు. శాసనసభ ఎన్నికల్లో 9 మంది ముస్లిం అభ్యర్థులు విజయం సాధించగా వారందరూ కాంగ్రెస్‌వారే. మొత్తం 15 చోట్ల ముస్లిం అభ్యర్థుల్ని హస్తం పార్టీ నిలబెట్టింది. ఆ రాష్ట్ర ఓటర్లలో దాదాపు 13% మంది ముస్లింలు ఉన్నారు. భాజపా సర్కారు రద్దుచేసిన 4% కోటాను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ.. వారిని ఆకట్టుకున్నట్లు ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’ను కేంద్రం నిషేధించడం, హిజాబ్‌ వివాదం.. ఈ రెండింటి తర్వాత కర్ణాటకలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలివి. జేడీఎస్‌ నుంచి 23 మంది ముస్లింలు పోటీచేస్తే ఒక్కరూ గెలవలేకపోయారు. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ రెండుచోట్ల పోటీచేసి 0.02% ఓట్లతో సరిపెట్టుకుంది.

4 శాతం పెరిగిన కాంగ్రెస్‌ ఓట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ తన ఓట్ల వాటాను 4 శాతానికి పైగా మెరుగుపరుచుకుంది. గతంలో 36 శాతంగా ఉన్నా భాజపా ఓట్ల శాతం ఇప్పుడు కూడా స్ధిరంగానే ఉంది. 2018తో పోలిస్తే జేడీఎస్‌ ఓట్లు 5 శాతం తగ్గాయి. 2018లో కల్యాణ కర్ణాటక పరిధిలో 41 స్థానాలకు 20 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు 26 స్థానాల్లో నెగ్గింది. 12 మంది కాంగ్రెస్‌ సభ్యులు 50వేలకు పైగా మెజారిటీ సాధించారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ల నుంచి 2019లో భాజపాలోకి ఫిరాయించి, ప్రభుత్వాన్ని కూల్చిన ఎమ్మెల్యేల్లో 8 మంది ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2,59,278 మంది ఓటర్లు నోటాకు ఓటేశారు.

ఎస్సీ-ఎస్టీల ఆదరణకు దూరంగా కమలం

ఈ ఎన్నికల్లో ఎస్టీలకు కేటాయించిన 15 సీట్లలో ఒక్క స్థానంలోనూ కమలం పార్టీ నెగ్గలేకపోయింది. దళితులకు ప్రత్యేకించిన 36 సీట్లలో 12 చోట్ల మాత్రమే భాజపా గెలిచింది. కాంగ్రెస్‌ 21 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా మూడు జేడీఎస్‌కు దక్కాయి.


అప్పుడు ఒక్క ఓటు తేడాతో ఓటమి

ఇప్పుడు 59వేల మెజారిటీ

2004 ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో చామరాజనగర జిల్లాలోని కొల్లేగల అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన ఎ.ఆర్‌.కృష్ణమూర్తి ఈ ఎన్నికల్లో మాత్రం 59వేల ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లోనూ ఓటమి చవిచూసిన ఆయన.. ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై సునాయసంగా గెలిచారు.


అక్కడికి వెళ్తే సీఎం పదవి ఊడినట్లే!

కన్నడనాట కొన్ని రాజకీయ సంప్రదాయాలు ఈసారి కూడా కొనసాగాయి. చామరాజనగరలో పర్యటించే సీఎం కచ్చితంగా తన పదవిని కోల్పోయే రివాజు పునరావృతమైంది. ఈ ఎన్నికలకు ముందు సీఎంగా బసవరాజ్‌ బొమ్మై రెండుసార్లు ఈ జిల్లాలో పర్యటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు