ప్రారంభోత్సవమా.. పట్టాభిషేకమా..!

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన పట్టాభిషేకంలా భావించారంటూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.

Published : 29 May 2023 03:42 IST

రాజుల కాలం కాదిది
మతాచారాలతో దేశం వెనక్కి
కాంగ్రెస్‌ సహా విపక్షాల ధ్వజం

దిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన పట్టాభిషేకంలా భావించారంటూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఇది చక్రవర్తులు, రాజుల కాలం కాదంటూ ఆగ్రహించాయి. మత ఆచారాల పేరుతో దేశాన్ని భాజపా-ఆరెస్సెస్‌లు వెనక్కి తీసుకువెళుతున్నాయంటూ కార్యక్రమాన్ని బహిష్కరించిన 21 విపక్ష పార్టీలు ఆరోపించాయి. రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తూ.. ప్రారంభించాల్సిన హక్కును రాష్ట్రపతి నుంచి లాక్కున్నారని ఆదివారం మండిపడ్డాయి. ‘‘పార్లమెంటు ప్రజల గొంతుక.. కానీ ప్రారంభోత్సవాన్ని తన పట్టాభిషేక కార్యక్రమంలా ప్రధాని భావించారు’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కును రాష్ట్రపతి నుంచి లాక్కున్నారు. నియంతృత్వ బలంతో క్రీడాకారిణులను వీధుల్లో కొట్టారు. భాజపా,ఆరెస్సెస్‌ ప్రవచించిన ప్రజాస్వామ్యం, జాతీయవాదం, కుమార్తెలను కాపాడండి అనే నినాదాలు అబద్ధాలన్న విషయం ఇప్పుడు ప్రజల ముందు బట్టబయలైంది’’ అని ఖర్గే పేర్కొన్నారు. పట్టాభిషేకం వ్యాఖ్యలపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సార్లు మోదీకి ప్రజలు అధికారం ఇచ్చారన్న విషయాన్ని రాహుల్‌ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ మండిపడింది. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మాత్రం సెంగోల్‌పై వివాదం అనవసరమంటూ ట్వీట్‌ చేశారు. 

నెహ్రూ ఆలోచనలకు వ్యతిరేకం: పవార్‌

పార్లమెంటు ప్రారంభోత్సవ సందర్భంగా నిర్వహించిన మతపరమైన కార్యక్రమాలపై ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. నెహ్రూ ఊహించిన ఆధునిక భారతానికి ఇది వ్యతిరేకమని అన్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మాత్రం కేంద్రానికి అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని