Balineni Srinivasa Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుస్తుందని పందెం కాశా

‘తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ముందే ఊహించా. వాళ్లకి యాభై సీట్లు కూడా రావు.. బీఆర్‌ఎస్సే మళ్లీ వస్తుందని వేరొకరంటే నేను కాంగ్రెస్‌పై రూ.50 లక్షలు పందెం కాశా.

Updated : 10 Dec 2023 07:47 IST

వైకాపా కార్పొరేటర్లు, నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తానంటేనే మళ్లీ పోటీకి దిగుతా
మంత్రి హోదాలో డబ్బు తీసుకున్నాను
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని సంచలన వ్యాఖ్యలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ‘తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు గెలుస్తుందని ముందే ఊహించా. వాళ్లకి యాభై సీట్లు కూడా రావు.. బీఆర్‌ఎస్సే మళ్లీ వస్తుందని వేరొకరంటే నేను కాంగ్రెస్‌పై రూ.50 లక్షలు పందెం కాశా. ఈ విషయం తెలిసి మా అబ్బాయి (ప్రణీత్‌రెడ్డి) వారించాడు. అక్కడ భారాస వస్తే ఇక్కడ జగన్‌ మళ్లీ వస్తాడనేది మా వాడి ఆలోచన. ఆ తర్వాత కాంగ్రెస్‌కు అరవై సీట్లపై మళ్లీ మరోసారి పందెం నా దగ్గరికి వచ్చింది. నాకు రూ.50 లక్షలు వస్తాయనే నమ్మకం ఉన్నా మా అబ్బాయి బాధపడకూడదని వదిలేశా.

ఎంతసేపూ జగన్‌ రావాలి, జగన్‌ రావాలి.. ఇదే ఆలోచన నా కుమారుడికి. జగన్‌ అంటే అంత పిచ్చి మాకు. కానీ, ఆయనకు మాపై ఉండాలిగా.. ఉండాలనే కోరుకుంటున్నా..’ అని మాజీ మంత్రి, వైకాపా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాలినేని ఈ మాటలన్నారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే తనతో పాటు తన కుటుంబానికి చిరాకు వస్తోందని.. తన కుమారుణ్ని రాజకీయాల్లోకి తీసుకురావాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ‘కార్పొరేటర్లు, డివిజన్‌ పార్టీ అధ్యక్షులు చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. రాబోయే ఎన్నికల్లో ఓ వర్గం రోడ్ల మీదకు వచ్చి పనిచేస్తుంది. మీరంతా నా కోసం గట్టిగా కృషి చేస్తానంటేనే మళ్లీ పోటీ చేస్తా.. లేదంటే మంచి వ్యక్తిగా రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలనే ఆలోచన ఉంది’ అని అన్నారు. ‘అయిదుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా పనిచేశాను. నేను నీతిమంతుణ్ని.. ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని చెప్పను. అబద్ధం చెప్పటం నాకు ఇష్టం ఉండదు. ఎమ్మెల్యేగా ఒంగోలు నియోజకవర్గంలో ఎవరి దగ్గర నుంచీ రూపాయి కూడా తీసుకోలేదు. మంత్రి పదవిలో మాత్రం డబ్బులు తీసుకున్నా’ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని