Prashant Kishor: జగన్‌ ఘోరంగా ఓడిపోతారు

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు.

Updated : 04 Mar 2024 06:48 IST

ఆయన చాలా పెద్ద తప్పు చేశారు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఆంగ్ల దినపత్రిక ‘ద న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు, ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో జగన్‌ ఓడిపోతున్నారు. అది కూడా మామూలు ఓటమి కాదు. భారీ ఓటమి తప్పదు’ అని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చదువుకున్న యువత ఉపాధి, ఉద్యోగాల కోసం చూస్తున్నారే తప్ప.. ప్రభుత్వం ఇచ్చే తాయిలాల కోసం కాదని అన్నారు. అయిదేళ్లలో మొత్తం వనరులను కొన్ని అంశాలపైనే ఖర్చు పెట్టడం, అభివృద్ధిని పట్టించుకోకపోవడం ద్వారా జగన్‌ పెద్ద తప్పు చేశారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జగన్‌ పరిస్థితి చూస్తుంటే మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని అన్నారు. పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, దీనికి భిన్నంగా ప్యాలెస్‌ల్లో ఉంటూ ప్రజల బాగోగులన్నీ తామే చూసుకుంటున్నామని భావిస్తున్నారని.. ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించబోరని ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు. ‘ప్రజలు ఎన్నుకున్న పాలకులు ఒక ప్రొవైడర్‌కంటే మెరుగైన పాత్ర పోషించాలి. కానీ చాలా మంది నాయకులు తమను తాము ప్రజలకు రాయితీలు కల్పించే ప్రొవైడర్లుగానే భావించుకుంటున్నారు. అలాంటివారు ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు’ అని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో జగన్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని